
ఔను! నా బుర్రలో ఏమీ లేదు: మెగాస్టార్
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ జోవియల్‌గా స్పందించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తనపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డ సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ విషయంలోనూ ఆయన చాలా తేలికగా స్పందించారు. అవును, తన మెదడులో ఏమీ లేదని, దాని పని దాదాపు ’ఖల్లాస్’ (ముగిసిపోయింది) అయిందని చెప్పుకొచ్చారు.
వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో నిలిచే జస్టిస్ కట్జూ ఇటీవల తనదైన శైలిలో బిగ్ బీని దుయ్యబట్టారు. అమితాబ్ మెదడులో ఏమీ లేదని, ఆయనను మీడియా వ్యక్తులు పొగడ్తల్లో ముంచెత్తుతారు కాబట్టి, వారి మెదళ్లలో కూడా ఏమీ ఉండకపోవచ్చునని కట్జూ చెప్పుకొచ్చారు. తాను బిగ్ బీని అంత తీవ్రంగా విమర్శించడానికి కారణాలు వివరిస్తూ ఓ పెద్ద వ్యాసం కూడా ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో ప్రచురించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే పాలకులకు సినీ స్టార్లు ఉపయోగపడతారని, అంతకుమించి వారి మెదళ్లలో ఏమీ ఉండదని కట్జూ చెప్పుకొచ్చారు.
సోమవారం ముంబైలో విలేకరులతో ముచ్చటించిన బిగ్ బీ ఈ అంశంపై స్పందించారు. ’జస్టిస్ కట్జూ చెప్పిందే కరెక్టే. నా మెదడు లోపల నిజంగా ఏమీ లేదు. దేశంలో ఏదైనా జరిగితే.. అందులో మేం పాలుపంచుకుంటాం. కానీ, ఆయనే కరెక్ట్. నా మెదడు ఖల్లాస్ అయింది’ అని వ్యాఖ్యానించారు.