అక్కడ టాయిలెట్లు కడిగాను!!
ఉగ్రవాద శిక్షణ కోసం ఐఎస్ఐఎస్లో చేరేందుకు ఇరాక్, సిరియా దేశాలకు వెళ్లిన ముంబై యువకుడు అరీబ్ మజీద్.. తానక్కడ టాయిలెట్లు కూడా కడిగినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న మజీద్, కొన్ని వివరాలు వెల్లడించాడు. తాను ఐఎస్ఐఎస్లోకి వెళ్లడానికి ముంబైలో ఎవరెవరు సహకరించారో, అక్కడకు వెళ్లేందుకు రవాణా ఏర్పాట్లు ఎవరెవరు చేశారోనన్న వివరాలను సైతం విచారణలో తెలిపాడు. తనను యుద్ధానికి పంపుతారని భావిస్తే, చాలా నీచమైన పనులు చేయించారని, యుద్ధక్షేత్రంలో ఉన్నవాళ్లకు నీళ్లు అందించడం, టాయిలెట్లు శుభ్రం చేయించడం లాంటివి చేయించారని అన్నాడు.
కొన్ని గంటల పాటు మజీద్ను ప్రశ్నించిన తర్వత స్థానికంగా ఎవరు సాయం చేశారో చెప్పాడని, వాళ్లే అతడితో పాటు మరో ముగ్గురిని కూడా రెచ్చగొట్టి ఇరాక్ పంపారని ఎన్ఐఏ అధికారి ఒకరు చెప్పారు. వాళ్లెవరో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తన పైన ఉండే సూపర్వైజర్ చెప్పినా కూడా తనను యుద్ధక్షేత్రంలోకి పంపలేదని మజీద్ చెప్పాడన్నారు. చివరకు తనకు బుల్లెట్ గాయం తగిలినా.. మూడు రోజుల వరకు ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో ఉగ్రవాదంపై ఆసక్తి తగ్గిపోయిందని, ఆస్పత్రికి వెళ్లడానికి కూడా ప్రాధేయపడాల్సి వచ్చిందని అన్నాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అక్కడ చాలామంది మహిళలపై అత్యాచారాలు కూడా చేసినట్లు మజీద్ వివరించాడు. తనతో పాటు వచ్చిన ముగ్గురికి ఏకే 47లు, రాకెట్ లాంచర్ల ప్రయోగంలో శిక్షణ ఇచ్చారన్నాడు.