దుస్తులిప్పి నగ్నంగా తనిఖీ చేశారు: నటి
సాక్షి, హాలీవుడ్: అమెరికాలోని ఉత్తర డకోటాలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నందుకు హాలీవుడ్ నటి షైలెనె వుడ్లీను పోలీసులు అరెస్టు చేశారు. 2016 అక్టోబర్‌లో డకోటా యాక్సెస్ పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా స్థానిక ఆదివాసీ జాతులు ఈ ఆందోళన నిర్వహించాయి. ఈ ఆందోళనలో పాల్గొన్న ఆమె నిరసన ప్రదర్శనను ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రసారం చేశారు. ఈ సందర్భంగా తనను అరెస్టు చేసిన పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని ఆమె వెల్లడించారు. 'డైవర్జెంట్', 'బిగ్ లిటిల్ లైస్' వంటి సినిమాల్లో నటించిన మేరీ క్లయిర్ యూకే షోలో తాజాగా ముచ్చటించారు. 'నా దుస్తులిప్పి నగ్నంగా తనిఖీలు నిర్వహించారు. నాతో చాలా క్రూరంగా అసభ్యంగా ప్రవర్తించారు. నేను డ్రగ్స్ కలిగి ఉన్నాన్నేమోనంటూ క్రూరంగా తనిఖీలు చేశారు' అని ఆమె తెలిపారు.
'జైలు సెల్‌లో ఉన్నప్పుడు తలుపులను మూసివేశారు. ఇక ఎవరూ రక్షించలేని పరిస్థితి. సెల్‌లో అగ్నిప్రమాదం జరిగి.. తలుపులు తెరవొద్దని జైలు సిబ్బంది భావిస్తే.. అందులోని వారు చనిపోయినట్టే. మీ పరిస్థితి బోనులోని జంతువు మాదిరి ఉంటుంది' అని ఆమె వివరించారు. తన అరెస్టు తర్వాత ఎంతో మానసిక క్షోభ (పీటీఎస్డీ)ను అనుభవించానని, మూడు నెలలు సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఒంటరిగా గడిపానని, ఎంతో కుంగుబాటుకు లోనయ్యానని ఆమె తెలిపారు. ప్రస్తుతం 'అడ్రిఫ్ట్' సినిమాలో సామ్ క్లెఫ్లిన్ సరసన కథానాయికగా నటిస్తున్న ఆమె భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని చెప్పారు.