ఒకరిని ప్రధాని పదవికి ప్రమోట్ చేసే శక్తి లేదు: సల్మాన్
2002లో గుజరాత్ జరిగిన మత ఘర్షణలకు నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పనవసరం లేదు అని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అన్నారు. మత ఘర్షణలకు సంబంధం లేనప్పుడు మోడీ ఎందుకు క్షమాపణ చెప్పాలి అని ఓ ప్రైవేట్ టెలివిజన్ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఒకవేళ ఆయనకు మత ఘర్షణలకు సంబంధం ఉంటే ఎందుకు కోర్టు క్లీన్ చిట్ ఎందుకు ఇస్తుందని అన్నారు.
ప్రధాని పదవికి ఒకరిని ప్రమోట్ చేసేంత శక్తి తనకు లేదని సల్మాన్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 'ప్రధాని పదవికి తగిన వ్యక్తి పేరును చెప్పను. లక్షలాది మంది అభిమానులపై తన నిర్ణయాన్ని రుద్దే ఉద్దేశం లేదని సల్మాన్ అన్నారు. తాను నటించిన జయహో చిత్రాన్ని ప్రమోట్ చేయడానికే గుజరాత్ వెళ్లానని.. మోడీని ప్రమోట్ చేయడానికి కాదు అని సల్మాన్ స్పష్టం చేశారు.
మోడీ సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయనతో భేటి అద్బుతం అని గుజరాత్ ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్ అభివృద్ది తనను ఎంతో ఆకట్టుకుందని.. మా జట్టులోని మహిళలకు మోడీ ఇచ్చిన గౌరవం తనను ఆకట్టుకుంది. ముఖ్యంగా తన సోదరికి ఇచ్చిన గౌరవంతో ఆయనపై మరింత గౌరవం పెరిగిందన్నారు. జైహో చిత్ర ప్రమోషన్ కోసం గుజరాత్ వెళ్లిన సల్మాన్ .. మోడీతో కలిసి పతంగుల ఉత్సవంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.