యూపీ ఫలితాలపై జోరందుకున్న బెట్టింగ్‌లు
లక్నో: అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అధికారం నిలబెట్టుకునేందుకు ఎస్పీ పోరాడుతుండగా.. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ, బీఎస్పీ.. ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ బరిలో దిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. యూపీలో విజయం ఎవరిది, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధిస్తారా అనేదానిపై సర్వేల్లో స్పష్టత రావడం లేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు జోరందుకున్నా.. ఎవరు గెలుస్తారనే విషయంలో బుకీలు కూడా గందరగోళంలో పడ్డారు.
యూపీ అసెంబ్లీకి ఏడు దశల్లో ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసింది. మొదటి రెండు దశల ఎన్నికల వరకు ఎస్పీ గెలుస్తుందని జోరుగా పందేలు కాశారు. ఆ తర్వాత బెట్టింగ్ రాయుళ్లు బీజేపీ వైపు మొగ్గుచూపడం మొదలెట్టారు. ప్రస్తుతం ఐదు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. హాంగ్ వస్తుందని భావించిన బుకీలు.. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం చూసి మనసు మార్చుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పందేలు కాయడానికి వెనుకంజ వేస్తున్నారు. మహారాష్ట్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ మంచి ఫలితాలు సాధించడంతో.. సర్జికల్ దాడులు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వంటి అంశాలు బీజేపీకి సానుకూలంగా పనిచేస్తున్నాయని బుకీలు భావిస్తున్నారు. 403 స్థానాలకు గాను బీజేపీ 161, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి 150, బీఎస్పీ 72 సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. పందేలు కూడా ఇదే లెక్కన కాస్తున్నారు.