అక్కడ మహిళలే మహారాణులు కానీ..
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఈ రాష్ట్రం నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు ఉమాభారతి, మేనకా గాంధీ కూడా యూపీ నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. బీఎస్పీ చీఫ్ కూడా మహిళే. మాయావతి మాజీ ముఖ్యమంత్రి కూడా. అప్నాదళ్‌లోనూ కృష్ణ పటేల్, అనుప్రియ పటేల్‌దే ఆధిపత్యం. ఇక ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఎంపీగా ఉన్నారు. ములాయం మరో కోడలు అపర్ణా యాదవ్ (ప్రతీక్ భార్య) శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నారీమణుల జాబితా చూస్తే యూపీలో మహిళలదే ఆధిపత్యం అనిపిస్తుంది. అయితే ఇదంతా నాణేనికి ఓ పార్శం మాత్రమే. యూపీ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంతమాత్రమే. అందులోనూ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నవారిలో, చట్టసభలకు ఎన్నికైన వారిలో చాలామంది వారసత్వంగా వచ్చినవారే.
యూపీలో మొత్తం 403 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. మొత్తం 4822 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో మహిళా అభ్యర్థులు కేవలం 445 మందే. మొత్తం అభ్యర్థుల్లో మహిళలు 9.16 శాతం మంది మాత్రమే. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి మహిళా అభ్యర్థుల సంఖ్య కేవలం 0.66 శాతం పెరిగింది. గత ఎన్నికల్లో మొత్తం 6839 మంది అభ్యర్థులు రంగంలో దిగగా, వీరిలో మహిళ అభ్యర్థులు 583 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 44, ఎస్పీ 33, ఆర్‌ఎల్‌డీ 25, బీఎస్పీ 19, కాంగ్రెస్ 11, ఇతర పార్టీలు మరో 18 మంది మహిళలకు టికెట్లు ఇచ్చాయి.