
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిటీ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ప్రకటించింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని అన్ని పార్టీలు కోరుకున్నట్లు ఈసీ వెల్లడించింది. అయితే పోలింగ్ సమయంలో ఓటర్లు భౌతిక దూరం పాటించేలా బూత్‌ల సంఖ్య పెంచనున్నట్లు తెలిపింది.
కాగా, దేశంలో విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల వాయిదా విషయాన్ని పరిశీలించమని అలహాబాద్ హైకోర్టు ఎన్నికల కమీషన్‌కు సూచించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికల కమీషనర్లు సమీక్ష జరపగా అన్ని పార్టీలు ఎన్నికలకు వెళ్లడానికే మొగ్గుచూపాయి.