సమైక్య లేఖ చంద్రబాబు ఇచ్చినా సంతకం చేస్తాం : శోభా నాగిరెడ్డి
వైఎస్సార్‌సీపీ నేత శోభా నాగిరెడ్డి స్పష్టీకరణ
* మేం ఇచ్చే లేఖపై సంతకానికి చంద్రబాబు సిద్ధమా?
* సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బాబు కుట్ర పన్నుతున్నారు
* సమైక్యం కోసం మేం ఏం చేసినా తప్పుపడుతున్నారు
* తన తోక పత్రికల్లో వేరే అర్థం వచ్చేలా రాయిస్తున్నారు
* సమైక్యాంధ్రపై టీడీపీ విధానమేంటో స్పష్టం చేయాలి
* సోనియాతో మీరు డీల్ కుదుర్చుకుని మాపై బురద చల్లుతారా?
* జగన్‌పై బురదజల్లే బదులు రాష్ట్ర సమైక్యతకు కృషి చేయండి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద బురద చల్లే బదులు, ఆరు కోట్ల తెలుగు ప్రజల గురించి ఆలోచించాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు, రాజగురువు రామోజీరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి హితవు పలికారు. సమైక్యాంధ్ర కోసం చంద్రబాబు ఏకవాక్య లేఖ ఇచ్చినా సంతకం చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టంచేశారు.
సమైక్యాంధ్ర జేఏసీ లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమైక్య లేఖపై సంతకానికి చంద్రబాబు సిద్ధమా అని సూటిగా ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో తమ పార్టీ ఏ అడుగు వేసినా దాన్ని చంద్రబాబు తప్పు పడుతున్నారని, ఎవరు దొంగలో, ఎవరు నిజాయితీగా ఉద్యమిస్తున్నారో తేల్చాల్సిన సమయం వచ్చిందన్నారు. సమైక్యాంధ్ర కోసం రాసిన ఏకవాక్య తీర్మానంపై సంతకం చేయడానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, బొత్స సత్యనారాయణలు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు ఎవరికీ లేదంటూ ఆరు కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకొచ్చి ఉద్యమాలు, ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ మా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు తన అభిమతాన్ని, పార్టీ విధానాన్ని చాలా స్పష్టంగా వెల్లడించారు.
సమైక్య రాష్ట్రం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలని కోరారు. అందుకోసం జేఏసీ నేతలు కేంద్రానికి ఒక లెటర్ డ్రాఫ్టు తయారుచేస్తే పార్టీ అధ్యక్షుడిగా సంతకం చేస్తానని చెప్పారు. ఆ దిశగా అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని కోరారు’’ అని వివరించారు. అయితే సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు కుట్రపన్నుతున్నారని శోభ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా వేరే అర్థం వచ్చేలా బాబు తన తోక పత్రికల్లో రాయిస్తున్నారని, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి మరో రంగుపూసి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘టీడీపీ నేతలకు, ఎల్లో మీడియాకు ఒకటి మనవి చేస్తున్నా. జగన్‌పై బురద చల్లే కార్యక్రమాలకు ఇచ్చే ప్రాధాన్యతను రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు ఇవ్వాలి’ అని చురక అంటించారు. సమైక్యాంధ్రపై టీడీపీ విధానమేంటో చంద్రబాబు స్పష్టం చేయాలని శోభ డిమాండ్ చేశారు. రెండు నెలలుగా సమైక్య ఉద్యమంలో ఉన్న ఎన్జీవో సోదరులు జీతాలు లేక కుటుంబాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు కట్టుబడిన పార్టీలేవి, డ్రామాలాడుతున్నవి ఏవో గమనించాలని జేఏసీలకు ఆమె విజ్ఞప్తి చేశారు.
విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వమని మేం చెప్పామా?
టీడీపీని దెబ్బతీయడానికి ఎవరో కుట్ర చేయాల్సిన అవసరంలేదని, చంద్రబాబు విధానాలే ఆ పార్టీని సర్వనాశనం చేస్తున్నాయని శోభ పేర్కొన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వమని మేం చెప్పామా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌జారీ చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడిన రోజునే టీడీపీ సగం చచ్చిపోయిందన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోమన్న ఏపీఎన్జీవోల విజ్ఞప్తిని తోసిపుచ్చినప్పుడు పూర్తిగా మరణించిందన్నారు. రాజకీయంగా జగన్‌ను దెబ్బతీయడానికి బాబు చేసే కుట్రలన్నీ ఆయనకే నష్టం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు.
నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అన్నిరకాల అండదండలు అందిస్తున్న టీడీపీ అధినేత.. ఇప్పుడు తాము కుమ్మక్కు అయ్యామని ఆరోపించడానికి సిగ్గేయట్లేదా అని దుయ్యబట్టారు. సోనియాగాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మాతో డీల్ కుదిరిందా లేక వారి నిర్ణయానికి అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబుతో డీల్ కుదిరిందా అని నిలదీశారు. సోనియాతో డీల్ కుదరలేదంటే చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకోమని రాజగురువు రామోజీ, తోకపత్రికలు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ‘‘సోనియాగాంధీ వదిలిన బాణం జగన్ అని తనది రామబాణం అని చంద్రబాబు అంటున్నారు. ఇంకా బాణాలు వదిలే పరిస్థితిలో ఉన్నారా! బాబు ఎప్పుడో అంపశయ్య మీద ఉన్నారు’’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన ఏకైక నాయకుడు జగన్ అని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌కే కాకుండా చంద్రబాబుకు కూడా మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారన్నారు. జగన్‌ను ఎదుర్కోలేక టీడీపీ నేతలు పిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు.
న్యాయస్థానాలపై గౌరవం లేదా?
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల మాత్రమే జగన్‌కు బెయిల్ వచ్చిందని శోభానాగిరెడ్డి స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే సీబీఐ తుది చార్జిషీట్ వేసిందే కానీ.. జగన్ మీద ప్రేమతోనో, అభిమానంతోనో కాదన్నారు. కేంద్రం పంజరంలో చిలక అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పుడు అన్ని పార్టీలూ స్పందించినా చంద్రబాబు మాత్రం నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదని గుర్తుచేశారు. కేసులు నిరూపితమై శిక్షపడిన వ్యక్తి జగన్ కాదని టీడీపీ నేతలు గుర్తుంచుకొని మాట్లాడాలని హితవు పలికారు. జగన్‌కు బెయిల్ రావడంపై వారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే న్యాయస్థానాలపై ఉన్న గౌరవమేంటో తెలుస్తోందన్నారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు, టీడీపీ నాయకులు.. మనిషి లక్షణాలను కూడా మరిచిపోయి నీచంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
వైఎస్సార్‌సీపీలో సబ్బం హరికి సభ్యత్వం లేదు..
అనకాపల్లి ఎంపీ సబ్బంహరి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని శోభ స్పష్టం చేశారు. తమ పార్టీలో ఆయనకు సభ్యత్వం కూడా లేదని పేర్కొన్నారు. జగన్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలో భాగంగా హరి మాట్లాడుతున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ ఇమేజ్‌ను ఎలాగైనా దెబ్బతీయాలని కాంగ్రెస్‌తోపాటు టీడీపీలోనూ కుట్ర జరుగుతోంది. అందులో భాగంగానే హరి మాట్లాడారు. ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో సభ్యత్వం లేదు. కేవలం పార్టీలోకి రావాలనుకుంటున్న వ్యక్తి మాత్రమే. అయితే జగన్ ఇమేజ్ దెబ్బతీసేందుకు కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలో భాగంగా హరి పావుగా మారారు. ఆయన మాట్లాడిన మాటలు మా అందర్నీ బాధించాయి. ముఖ్యంగా జగన్‌మోహన్‌రెడ్డి చాలా బాధపడ్డారు. సబ్బం హరి వ్యాఖ ్యలకు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు, ఇకపై కూడా సంబంధం ఉండదు. ఆయన మా పార్టీలోకి వస్తానన్నా చేర్చుకునేది లేదు’’ అని శోభానాగిరెడ్డి స్పష్టంచేశారు.