కాంగ్రెస్-బీఎస్పీ జోడీ కడితే!?
లక్నో: బిహార్ ఎన్నికల ఫలితాలు.. దేశవ్యాప్తంగా కొత్త కూటములకు దిశానిర్దేశం చేస్తున్నాయి. బద్ధశత్రువులైన లాలూ, నితీశ్ ఏకమై ఘన విజయం సాధించటంతో.. 2017 ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో కొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. ఏ రకమైన రాజకీయ మార్పుకైనా అన్ని అవకాశాలున్న యూపీలో.. బీఎస్పీ-కాంగ్రెస్ పార్టీలు ఏకమయితే.. బిహార్ ఫలితాలు రావొచ్చని రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. 1996 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ కలిసి పోటీచేసినా పెద్దగా ప్రభావం లేదు. అయితే ఈసారి పరిస్థితిలో మార్పు ఉండొచ్చని గణాంకాలు చెబుతున్నాయి.
2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 25.9 శాతం, కాంగ్రెస్ 11.7 శాతం, బీజేపీ 15 శాతం ఓట్లు సాధించగా.. సమాజ్‌వాద్ పార్టీ 29.1 శాతం ఓట్లతో 224 స్థానాలు (మొత్తం 403 సీట్లలో) గెలుచుకుంది. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఓటు శాతం 15 నుంచి అమాంతం 42.6కు పెరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన ఢిల్లీ, బిహార్ ఎన్నికల్లో మోదీ హవా కనిపించకపోవటంతో.. బీఎస్పీ-కాంగ్రెస్ పొత్తు మంచి ఫలితాలిస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
గంపగుత్తగా దళిత ఓట్లు
2014 పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ ఒక్కసీటూ గెలవకపోయినా.. యూపీలో మెజారిటీగా ఉన్న దళిత ఓటర్లు మాత్రం మాయావతితోనే ఉన్నారు. అయితే, బిహార్లో లాలూ పడి లేచినట్లే.. యూపీలో మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులతో యూపీలో మాయా పట్టుపెంచుకునే అవకాశాలు కనబడుతున్నాయి.
కాంగ్రెస్‌తో జోడీ కుదిరితే..
తాజా పరిస్థితులను గమనిస్తే.. 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ-బీజేపీ కలిసి పోటీ చేసినా.. వీరిని ఎదుర్కునేందుకు మాయావతికి కాంగ్రెస్‌ను మించిన జోడీ దొరకదు. కాంగ్రెస్ 10శాతం ఓట్లు సంపాదించినా.. అది మాయావతి కూటమికి అనుకూలాంశమే. యూపీలో కీలకంగా మారిన ముస్లిం ఓట్లు కూడా.. ఎన్నికలకు ముందు బీఎస్పీ-కాాంగ్రెస్ పొత్తుపెట్టుకుంటే వీరికే మద్దతిచ్చేలా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో ముజఫర్‌నగర్ ఘటన జరిగినట్లు.. ఇప్పుడు దాద్రీ కూడా అఖిలేశ్ హయాలోనే జరగటం ఎస్పీకి ఎదురుదెబ్బేనని.. ముస్లిం ఓటర్లు ఎస్పీకి దూరమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకు లంటున్నారు.