
'మనసు చంపుకుని అసెంబ్లీలో ఉన్నా'
హైదరాబాద్: తాను ఏ తప్పు చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ... తాను నిప్పులా బతికానని చెప్పారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేయలేకపోయారని చెప్పారు. అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నామని తెలిపారు. శాసనసభలో హుందాగా ప్రవర్తించాలని, సభా గౌరవం కాపాడాలని తమ ఎమ్మెల్యేలను కోరారు.
ఓటుకు కోట్లు అంశంపై శాసససభలో ప్రస్తావనకు రావడంతో గందరగోళం చెలరేగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీఆర్ ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రాజధానిలో తనపై విచారణ ఎలా చేయిస్తుందని ప్రశ్నించారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమల్లో ఉందని గుర్తు చేశారు.
అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడుతున్నారని వాపోయారు. మనసు చంపుకుని ప్రజల కోసం అసెంబ్లీలో ఉంటున్నామని చెప్పారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు తనకు మైక్ ఇవ్వలేదని, కనీసం మీకు మైకు అయినా తీస్తున్నారు సంతోషించండి అని వైఎస్సార్ సీపీ సభ్యులను ఉద్దేశించి అన్నారు.