సూపర్ 30 అరుదైన రికార్డు
- ఐఐటీ జేఈఈ ఫలితాల్లో మరోసారి హవా
- శిక్షణ పొందిన అందరూ అర్హతసాధించారు
పట్నా: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(ఐఐటీ-జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో సూపర్ 30 సంస్థ మరోసారి సాహో అనిపించింది. బిహార్‌లోని పట్నా కేంద్రంగా నడిచే ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన 30 మంది విద్యార్థుల్లో నూటికి నూరుశాతం మంది జేఈఈ అర్హత సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. వీరంతా అట్టడుగు వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం.
సరైన అవకాశాలు కల్పిస్తే పేద కుటుంబాల పిల్లలు కూడా ఐఐటీలలో సీట్లు సాధించగలరని మరోసారి నిరూపితమైందని అన్నారు సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్. 2002లో ప్రారంభించిన సూపర్ 30 విద్యా సంస్థ ద్వారా ఏటా 30 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా ఐఐటీ-జేఈఈ కోచింగ్‌తోపాటు భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఏయేటికాయేడు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోన్న సూపర్30ని ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘ద బెస్ట్ ఆఫ్ ఆసియా 2010’ జాబితాలో పొందుపర్చడం తలిసిందే. గతేడాది 30 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా 28 మంది జేఈఈలో అర్హత సాధించారు.
సీట్ల సంఖ్య పెంచుతాం: ఆనంద్‌కుమార్
ఆదివారం ఐఐటీ-జేఈఈ ఫలితాలు వెల్లడైన అనంతరం ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘సరైన సహకారం అందిస్తే పేద, అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు సైతం అద్భుతాలు సృష్టించగలని సూపర్ 30 ద్వారా ఎన్నో ఏళ్లుగా నిరూపిస్తున్నాం. అలాంటి మట్టిలోమాణిక్యాలు ఇంకా ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ల కోసమే సీట్ల సంఖ్య పెంచాలనే నిర్ణయానికి వచ్చాం. తద్వారా ఇప్పటికంటే మరింత మందికి సేవలు అందించినట్లవుతుంది’ అని ఆనంద్ కుమార్ చెప్పారు.