
వైరల్ వీడియో: కానిస్టేబుల్ ప్రధానికి ఫిర్యాదు
లక్నో: నిన్నగాన మొన్నసైనికోద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో దుమారం రేపింది. తాజాగా ఉత్తరప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. తన సీనియర్ అధికారి వేధింపులు, అవినీతిపై ప్రదానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తూ ఫేస్ బుక్ లో ఈ వీడియో పోస్ట్ చేయడం కలకలం రేపింది. ఈటా లోని కానిస్టేబుల్ సర్వేష్ చౌదరి తన సీనియర్ అధికారిక రాజేష్ కృష్ణ పై పలు ఆరోపణలు చేశారు.
కేవలం లంచం చెల్లించనందుకే తనపై కక్ష సాధిస్తున్నారంటూ ఈ వీడియోలో ప్రధానికి ఫిర్యాదు చేశారు. తాను ఘజియాబాద్ లో చేరినప్పటి నుంచి ఐదుసార్లు బదిలీ చేసినట్టు తెలిపారు. అలాగే సరైన కారణం లేకుండానే మూడుసార్లు సస్పెండ్ చేశారని వాపోయారు. తాను రూ. 500 లంచం ఇవ్వడానికి నిరాకరించినందు వల్లే తనపై వేటు పడిందని వాపోయారు. సర్వీసులోకి తీసుకున్నప్పటికీ , సస్పెన్షన్ పీరియడ్ ఇంకా జీతం చెల్లించలేదని ఆ వీడియోలో చెప్పారు.
అంతేకాదు 24 గంటలూ పనిచేస్తూ, పోలీసుల ఉద్యోగుల్లో 80శాతంమంది అనారోగ్యంతో బాధపడుతున్నారని సర్వేష్ చౌదరి పేర్కొన్నారు. ఇంకా బ్రిటిష్ కాలం నాటి 1861 పోలీసు చట్టం నల్లచట్టంగా అభివర్ణించడంతోపాటు.. ఈ చట్టాన్ని ఇప్పటి అధికారులు తమపై వేధింపులకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి చట్టాలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించారు. మథురకు చెందిన సర్వేష్ ప్రస్తుతం పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈటా పోలీసుస్టేషన్ లో పనిచేస్తున్నారు.
అయితే దీనిపై అదనపు సూపరిండెంట్ అనూప్ కుమార్ విచారణకు ఆదేశించారని ఈటా జిల్లా పోలీసు ఉన్నతాధికారి రాజేష్ కృష్ణ తెలిపారు. సర్వేష్ బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించని కారణంగా జీతం చెల్లింపులో ఆలస్యమైందనీ, 2016అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చెల్లింపులు జరిపినట్టు వివరించారు.