వరదలతో అపార్ట్ మెంట్లపైకి ఎక్కిన చెన్నై వాసులు
చెన్నై: భారీ వర్షాలతో చెన్నై వాసులు కనీవినీ ఎరుగని రీతిలో కష్టాలు పడుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీరు దొరకడం లేదు. కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా చోటులేకపోవడంతో ప్రజలు బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. అశోక్ నగర్ ప్రాంతంలో ఓ మహిళ తన తల్లి శవం పక్కనే కూర్చుని దాదాపు 20 గంటలుగా జాగారం చేస్తోంది. తనకు సహాయం చేయాలని సదరు మహిళ స్నేహితులను కోరడం, వారు మీడియాను అభ్యర్థించడంతో ఈ విషయం వెలుగుచూసింది.
'మా అమ్మ డయాలిసిస్ పేషెంట్. నిన్ననే ఆమె చనిపోయింది. కరెంట్ లేకపోవడంతో భౌతికకాయం చీకటిలోనే ఉంది. శవాన్ని శ్మశానానికి తరలించేందుకు దయచేసి ఎవరైనా వాహనం పంపించండి. ఇప్పటికే భౌతికకాయం పాడైపోయ్యే స్థితిలో ఉంది. నాకు సహాయం చేయండి' అని ఆమె వేడుకుంది. దీంతో కరిగిపోయిన ఆమె స్నేహితులు మీడియాకు సమాచారం అందించారు.
కాగా, వరదలు పోటెత్తడంతో చెన్నైకు సంబంధాలు తెగిపోయాయి. సహాయక కార్యక్రమాలు చురుగ్గా సాగడం లేదు. సైన్యం, నావికా దళం, వాయుసేన తదితర బలగాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.