కులం గోడ బద్దలు కొట్టండి
• పూర్తి మెజారిటీతో ఆశీర్వదించండి
• యూపీ ప్రజలను కోరిన ప్రధాని నరేంద్ర మోదీ
• నల్లధనం జమలో, కుటుంబ రాజకీయాల్లో ప్రత్యర్థులు బిజీ
• అవినీతిని తొలగించమంటే.. విపక్షాలు నన్ను తొలగించాలంటున్నాయి
మీరెప్పుడైనా ఎస్పీ, బీఎస్పీలు కలిసుండటం చూశారా? ఎస్పీ అవునంటే.. బీఎస్పీ కాదంటుంది. కానీ చాన్నాళ్ల తర్వాత వారిద్దరూ ఏకమయ్యారు. మోదీని మార్చేయాలి, మోదీని తొలగించాలంటున్నారు. కానీ మోదీ మాత్రం మీ నోట్లు మార్చుకోండి, నల్లధనాన్ని తొలగించాలంటున్నాడు. – లక్నో సభలో మోదీ
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రజలు కుల రాజకీయాల చట్రం నుంచి బయటకొచ్చి ఆలోచించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. సోమవారం లక్నోలో జరిగిన మహాపరివర్తన్ ర్యాలీలో మాట్లాడుతూ.. విపక్షాలు నల్లధనాన్ని సర్దుకోవటంలో బిజీగా ఉన్నాయని, వారి కుటుంబ రాజకీయాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేవని విరుచుకుపడ్డారు. ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఒక అంశంపై ఎప్పుడూ కలసి పనిచేయలేదని.. అలాంటిది తను నల్లదనం తొలగించేందుకు పోరాటం చేస్తుంటే ఈ రెండు పార్టీలు తనను తొలగించాలంటూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయన్నారు. ‘మీరెప్పుడైనా ఎస్పీ, బీఎస్పీలు కలిసుండటం చూశారా? ఎస్పీ అవునంటే.. బీఎస్పీ కాదంటుంది.
కానీ చాన్నాళ్ల తర్వాత వారిద్దరూ ఏకమయ్యారు. మోదీని మార్చేయాలి, మోదీని తొలగించాలంటున్నారు. కానీ మోదీ మాత్రం మీ నోట్లు మార్చుకోండి, నల్లధనాన్ని తొలగించాలంటున్నాడు’ అని అన్నారు. ఓ పార్టీ (కాంగ్రెస్) కుమారుడిని గొప్ప నాయకుడిగా చూపేందుకు 15 ఏళ్లుగా కష్టపడుతోందని.. విమర్శలు ఎక్కుపెట్టారు. మరోపార్టీ (బీఎస్పీ) సంపాదించింది ఎక్కడ దాచుకోవాలో ఆందోళన చెందుతోంది. ఇంకోపార్టీ (ఎస్పీ) కుటుంబ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోందన్నారు. కుటుంబ రాజకీయాలు చేసే పార్టీ, నల్లధనాన్ని దాచుకునేందుకు ప్రయత్నించే పార్టీలు యూపీని అభివృద్ధి చేస్తాయా? లేదా అనేది యూపీ ప్రజలు ఆలోచించాలన్నారు.
ఎస్పీకి అభివృద్ధి పట్టదు
కేంద్రం పూర్తి మద్దతు ప్రకటించినప్పటికీ రైతులకు మద్దతు ధర ఇచ్చే అంశంపై దృష్టి సారించేందుకు కూడా సీఎం అఖిలేశ్‌కు సమయం దొరకలేదన్నారు. 14 ఏళ్లుగా వెనకబడ్డ యూపీలో పరిస్థితులు త్వరలో మారతాయన్నారు. ప్రజలు చాన్నాళ్లుగా కుటుంబ రాజకీయాలు చూస్తున్నారని.. యూపీలో అభివృద్ధి జరిగిందా లేదా వారికే తెలియాలన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (లక్నోకు ప్రాతినిధ్యం వహించేవారు) మాటలను గుర్తుచేస్తూ.. ఇక్కడి ప్రజల స్పందనపట్ల ఆయన సంతృప్తిగా ఉండేవారన్నారు. ‘మేం భీమ్ యాప్‌ను విడుదల చేశాం. దీనికి రాజ్యాంగ నిర్మాత, ఆర్థిక వేత్త డాక్టర్ అంబేడ్కర్ పేరుపెట్టాం. భవిష్యత్ లావాదేవీలు అంబేడ్కర్ పేరుతో జరిగితే కొందరికి ఇబ్బంది కలుగుతోంది. మనం గ్రామాలకు వెళ్లాలి ప్రజలకు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పాలి. ప్రతిచోటా భీమ్‌పేరు మార్మోగేలా చేయాలి. అదే అంబేడ్కర్‌కు అసలైన నివాళి’ అని ప్రధాని తెలిపారు.
ఆశీర్వదించండి
‘మోదీ అవినీతిపరుల డబ్బును తీసుకుని పేదోళ్లకిస్తానంటే కొందరి సీట్లు కదులుతున్నా’యన్నారు. అందుకే కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతిని పూర్తిగా తొలగించేంతవరకు ఈ యుద్ధం ఆగదని, అందుకు యూపీ ప్రజల ఆశీస్సులుండాలన్నారు. ‘కేంద్రం ఇప్పుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతోంది. 30 ఏళ్లలో ఇది తొలిసారి. దేశానికి ఓ ప్రధాని ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి హైకమాండ్ 125 కోట్ల ప్రజలే’ అని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక యూపీకి ఏడాదికి లక్షకోట్లు ఇస్తున్నామన్న మోదీ.. అవి సంక్షేమానికి ఉపయోగపడుంటే పరిస్థితి వేరోలా ఉండేదన్నారు. యూపీలో అభివృద్ధి జరిగేందుకు బీజేపీకి పూర్తి మెజారిటీ ఇవ్వాలని మోదీ కోరారు. కాగా, ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.