ఆన్‌లైన్ చదువుల సిరి | Increasing E-Learning Sites | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ చదువుల సిరి

Published Wed, Feb 18 2015 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

ఆన్‌లైన్ చదువుల సిరి

ఆన్‌లైన్ చదువుల సిరి

 3 బిలియన్ డాలర్లకు  భారత మార్కెట్
  పెరుగుతున్న ఈ-లెర్నింగ్ సైట్లు

 న్యూఢిల్లీ: పెరుగుతున్న ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల వాడకం విద్యాభ్యాసానికి ఉన్న హద్దులను తుడిపేస్తోంది. దీంతో ఆన్‌లైన్ చదువుల రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈలెర్నింగ్ సంస్థలు కొత్త టెక్నాలజీ, భారీ ప్రణాళికలతో వస్తున్నాయి. దేశీయంగా ఈ-లెర్నింగ్ మార్కెట్ 3 బిలియన్ డాలర్ల (రూ.18,000 కోట్లు) మేర ఉంటుందని అంచనా.  సింప్లీ లెర్న్, ఇంటెలిపాట్ లాంటి స్టార్టప్ సంస్థలు మధ్యస్థాయి ప్రొఫెషనల్స్‌కి ఉపయోగపడే కంటెంట్‌ను అందిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన లెర్న్‌సోషల్, నాలెడ్జ్‌ఇన్ వంటి ఈ లెర్నింగ్ సైట్లు నేర్చుకునే వారికి, నేర్పేవారికి మధ్య సంధానకర్తలుగా ఉంటున్నాయి. కొన్ని సైట్లు ఆన్‌లైన్ తో పాటు  ఆఫ్‌లైన్ మాధ్యమాలను కూడా మేళవించి కోర్సులు అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా ఆన్‌లైన్ ట్రెయినింగ్ సైట్లు పాఠశాల, కాలేజీ స్థాయి కోర్సులతో పాటు కొన్ని ప్రొఫెషనల్ కోర్సులనూ అందిస్తున్నాయి.

ఉదాహరణకు, ఎంట్రన్స్ ఇండియా సంస్థ భారత్‌లో నిర్వహించే ఇంజినీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించి ప్రాక్టీస్ పేపర్స్ అందిస్తోంది. కుప్పలు తెప్పలుగా లభించే స్టడీ మెటీరియల్‌తో విద్యార్థులు గందరగోళపడ కుండా... అవ సరమైన వాటిపైనే దృష్టి పెట్టేలా ఇది తోడ్పడుతోంది. సింప్లీలెర్న్ సంస్థ .. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్‌మెంట్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ మొదలైన అంశాల్లో 200 పైచిలుకు సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తోంది. ఇది 150 దేశాల్లో 300 పైగా కోర్సులను అందిస్తోంది. 2,00,000 పైచిలుకు ప్రొఫెషనల్స్‌కి శిక్షణనిచ్చింది.

ఈ కంపెనీలో సుమారు 600 మంది ఉద్యోగులు ఉన్నారు. 2011లో ప్రారంభమైన ఇంటెలిపాట్ సంస్థ ఐటీ ప్రొఫెషనల్స్‌కి ఆన్‌లైన్ శిక్షణఇస్తోంది. వివిధ అంశాల్లో దాదాపు 80 సాంకేతిక కోర్సులను అందిస్తోంది. మధ్యస్థాయి ప్రొఫెషనల్స్, విద్యార్థులకు అవసరమయ్యే కంటెంట్‌ను అందించడంపై లెర్న్‌సోషల్ దృష్టిపెడుతోంది. తాము ఆన్‌లైన్ లెర్నింగ్‌లో అమెజాన్ స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చెబుతోంది. ఇదే కోవకి చెందిన నాలెడ్జ్‌ఇన్ సంస్థ పూర్తిగా ఐటీ సంబంధిత కోర్సులపై  దృష్టి పెడుతోంది.
 
 ఆన్‌లైన్ ఎందుకు..
 దశాబ్దం క్రితం సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అంటే ఏవో కొన్ని ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజీలు తెలిసి ఉంటే చాలు. కానీ ప్రస్తుతం వారు బిగ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సంక్లిష్టమైన వాటి గురించి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకు తీరాల్సిన పరిస్థితి ఉంది. ఇలా అప్‌డేట్‌గా ఉంటేనే ప్రమోషన్లు, వేతనాల పెంపు లభిస్తున్నాయి. దీంతో ఉద్యోగరీత్యా ఎదిగేందుకు కావాల్సిన నైపుణ్యాల కోసం ప్రొఫెషనల్స్ ఆన్‌లైన్ మాధ్యమానికి మళ్లుతున్నారు. అదే కాకుండా .. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయకపోవటమన్నది భారతీయ విద్యావ్యవస్థలో ప్రధాన లోపమని పరిశ్రమ నిపుణుల విశ్లేషణ. కాబట్టి.. భవిష్యత్‌లో విద్యాభ్యాసం అంతా ఆన్‌లైన్ కోర్సులపైనే ఆధారపడే అవకాశాలున్నాయని వారి అభిప్రాయం. పైగా ఎక్కడైనా, ఎప్పుడైనా చదువుకునే వీలుండటమూ ఆన్‌లైన్‌కు ప్రాధాన్యం పెరగటానికున్న కారణాల్లో ఒకటి.
 
 ‘మూక్స్’తో ఉచితంగానే...!
 ఆన్‌లైన్‌లో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి ఉచితంగా కోర్సులందించే ధోరణీ పెరుగుతోంది. ముద్దుగా ‘మూక్స్’ అని పిలుస్తున్న మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులనందిస్తున్న సంస్థల్లో స్టాన్‌ఫోర్డ్ వంటి వర్సిటీలూ ఉంటున్నాయి. అమెరికాకు చెందిన వర్సిటీల కోర్సుల్ని ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్న సంస్థల్లో coursera.com, edx.org, udemy.com Ð]ంటివి ముందున్నాయి. యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల కోర్సుల్ని కూడా కొన్ని సంస్థలు అందిస్తుండగా... ప్రధానంగా ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం, ఆండ్రాయిడ్, ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, మేనేజిమెంట్ కోర్సులకు డిమాండున్నట్లు ఆ సంస్థలు చెబుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement