వచ్చే నెలలో వ్యోమనౌక ప్రయోగం
మళ్లీ మళ్లీ ఉపయోగించుకునేలా రూపకల్పన: ఇస్రో
న్యూఢిల్లీ: అంతరిక్షంలోకి ఉపగ్రహాలను మళ్లీ మళ్లీ ప్రయోగించేందుకు వీలయ్యే పునర్వినియోగ వాహక నౌక (వ్యోమనౌక)ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వచ్చే నెలలో ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. ప్రస్తుతం ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ వంటి రాకెట్లను ఇస్రో వినియోగిస్తోంది. ఇవి కేవలం ఒకేసారి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టిన తర్వాత తిరిగి భూమిని చేరి, మళ్లీ వినియోగించుకోగలిగే వ్యోమనౌకలను వినియోగిస్తే భారీ స్థాయిలో వ్యయం ఆదా అవుతుంది.
ఇప్పటికే అమెరికా, రష్యాలు ఇలాంటి వ్యోమనౌకలను వినియోగిస్తున్నాయి. దీంతో ఆ తరహా వ్యోమనౌకలను అభివృద్ధి చేయడంపై ఇస్రో దృష్టిపెట్టింది. వచ్చే నెలలో ప్రయోగాత్మక పరీక్షను జరపనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ వెల్లడించారు. ‘‘వ్యోమనౌకను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ఎన్నో దశలను అధిగమించాల్సి ఉంది. మొదట దీనిని సముద్రంలో ల్యాండ్ చేయనున్నాం.
అంతిమంగా శ్రీహరికోటలోని రన్‌వేపై వ్యోమనౌక ల్యాండ్ అయ్యేలా అభివృద్ధి చేస్తాం. ఈ పునర్వినియోగ వ్యోమనౌక వల్ల అంతరిక్ష ప్రయోగాల వ్యయం దాదాపు పదోవంతు తగ్గుతుంది..’’ అని ఆయన చెప్పారు. ప్రత్యేకంగా అంతరిక్ష శాస్త్ర పరిశోధనల నిమిత్తం తొలిసారిగా ‘ఆస్ట్రోశాట్’ ఉపగ్రహాన్ని సెప్టెంబర్‌లో ప్రయోగించనున్నట్లు తెలిపారు. మార్స్ ఆర్బిటార్ మిషన్ నుంచి చిత్రాలను అందుకున్నామని వాటిని పరిశీలించిన అనంతరం విడుదల చేస్తామని చెప్పారు.
కాగా ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ కూడా పాల్గొని ప్రసంగించారు. గత ఏడాది ఇస్రో 11 ఉపగ్రహాలను ప్రయోగించిందని చెప్పారు. ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌లో భాగంగా వచ్చే ఏడాది మూడు ఉపగ్రహాలను, ఆ తర్వాత ఏడాది రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు తెలిపారు.