
Chidambaram
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన సహాయ ప్యాకేజీల కోత(ట్యాపరింగ్) నిర్ణయం భారత్‌పై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చని ఆర్థిక మంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన సహాయ ప్యాకేజీల కోత(ట్యాపరింగ్) నిర్ణయం భారత్‌పై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చని ఆర్థిక మంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామం వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసానిచ్చారు. ఫెడ్ చర్యల ప్రభావంతో దేశీ స్టాక్, కరెన్సీ మార్కెట్లు కొద్దిగా కుదుపునకు గురయ్యాయి.
పాలసీ చర్యలకూ వెనుకాడం...
ప్రస్తుతానికైతే ఫెడ్ చర్యల ప్రభావంపైనే తాము దృష్టిసారించామని... అవసరమైతే విధానపరమైన చర్యలకూ సిద్ధమేనని చిదంబరం స్పష్టం చేశారు. ‘ఫెడ్ నిర్ణయాల ప్రభావాన్ని మార్కెట్లు ఇప్పటికే చవిచూశాయి(ఫ్యాక్టర్ చేసుకున్నాయి). అందువల్ల ఫెడ్ స్వల్ప మార్పులు పెద్దగా ఆశ్చర్యపరచలేదనే భావిస్తున్నా. దీని ప్రభావం మనపై పెద్దగా ఉండకపోవచ్చు కూడా. అయితే, కొన్ని ప్రతికూలతలకు అవకాశం ఉన్నప్పటికీ... ఈ ఏడాది మేతో పోలిస్తే ట్యాపరింగ్ పరిణామాన్ని ఎదుర్కోవడానికి మరింత సన్నద్ధంగా ఉన్నాం’ అని విత్తమంత్రి చెప్పారు. ఫెడ్ ప్యాకేజీల కోత ప్రకటన నేపథ్యంలో గురువారం ఉదయం ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో దీనిపై చర్చించినట్లు కూడా చిదంబరం వెల్లడించారు. వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఏంచేస్తుందనేది వేచిచూడాల్సి ఉందని చెప్పారు. పాలసీ వడ్డీ రేట్లను ఇప్పుడున్న కనిష్టస్థాయి(పావు శాతం)లోనే కొనసాగిస్తామని తాజా సమీక్షలో ఫెడ్ తెలిపింది.
రూపాయి స్థిరపడుతోంది...
జపాన్‌తో ద్వైపాక్షిక కరెన్సీ మార్పిడి ఒప్పందాన్ని 15 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్లకు పెంచుకున్నామని... దీంతో రూపాయి మారకం విలువ స్థిరీకరణకు దోహదం చేస్తున్నట్లు చిదంబరం చెప్పారు. కాగా, ప్రతి గంటకూ రూపాయి విలువను సమీక్షించడం కుదరదని.. ఇప్పటికే కొంత స్థిరీకరణ జరిగిందన్నారు. ఇదేపరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. బాండ్‌ల కొనుగోలులో ఫెడ్ కోత చాలా తక్కువేనని, అంతేకాకుండా... దీనికి కొనసాగింపు వంటిదేమీ ప్రకటించని విషయాన్ని చిదంబరం గుర్తు చేశారు. అమెరికాలో ఉద్యోగాలు భారీగా పుంజుకునేంతవరకూ ప్రస్తుత సహాయ ప్యాకేజీలు కొనసాగుతాయని.. ఇతరత్రా పాలసీ అస్త్రాలను ఫెడరల్ రిజర్వ్ తగిన విధంగా ఉపయోగిస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయదు: కార్పొరేట్లు
ఫెడ్ ప్యాకేజీల కోత... భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశాల్లేవని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు కావలసినంత పరిమాణంలో స్థిరంగానే ఉన్నాయని... అదేవిధంగా కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఆందోళనలు కూడా తగ్గుముఖం పడుతుండటమే దీనికి కారణమని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనాలాల్ కిద్వాయ్ పేర్కొన్నారు.
10 బిలియన్ డాలర్ల కోత
2008లో కుదిపేసిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్(ఫెడ్)... బాండ్‌ల కొనుగోలు రూపంలో సహాయ ప్యాకేజీలను ప్రకటించడం తెలిసిందే. అయితే, అక్కడి ఆర్థిక వ్యవస్థ గాడిలోపడుతున్న బలమైన సంకేతాల నేపథ్యంలో ట్యాపరింగ్‌ను మొదలుపెడుతున్నట్లు 2 రోజుల పాలసీ సమీక్ష అనంతరం బుధవారం పొద్దుపోయాక ఫెడ్ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగిస్తున్న నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్‌ల కొనుగోలులో 10 బిలియన్ డాలర్ల కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి బాండ్‌ల కొనుగోలు 75 బిలియన్ డాలర్లకు తగ్గించనున్నట్లు ఫెడ్ చైర్మన్ బెర్నాంకీ తన ఆఖరి పాలసీ సమీక్ష అనంతరం వెల్లడించారు. జనవరి 31తో ఆయన పదవీకాలం ముగియనుంది. కొత్త ఫైడ్ చైర్మన్‌గా జేనెట్ ఎలెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, ప్యాకేజీలలో కోత విధించనున్నట్లు తొలిసారిగా ఈ ఏడాది మే లో ఫెడ్ ప్రకటించింది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వర్ధమాన స్టాక్, కరెన్సీ మార్కెట్లు కుప్పకూలాయి కూడా. ఆతర్వాత ట్యాపరింగ్‌ను వాయిదావేస్తూ వచ్చిన ఫెడ్.. ఇప్పుడు ఎట్టకేలకు మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది.