ద్రవ్యోల్బణంపై రాజన్ సూచన బాగుంది
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం అదుపునకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన ఒక ప్రతిపాదనకు చిదంబరం శుక్రవారం సంపూర్ణ మద్దతు పలికారు. దీని ప్రకారం పార్లమెంటు ద్వారా ప్రభుత్వం ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించడం, ఇందుకు తగిన మార్గాలను అన్వేషించడం వంటి బాధ్యతలను ఆర్‌బీఐకి అప్పగిస్తుంది. తద్వారా ఒకవైపు ధరల స్థిరీకరణ, మరోవైపు వృద్ధి సాధనకు మార్గం సుగమం చేయడానికి వెసులుబాటు కలుగుతుంది. ఆర్‌బీఐ బోర్డ్‌తో శుక్రవారం ఆర్థికమంత్రి సాంప్రదాయిక బడ్జెట్ అనంతర సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమావేశం అనంతరం చిదంబరం విలేకరులతో మాట్లాడారు. ద్రవ్యోల్బణంపై రాజన్ సూచనను ఈ సందర్భంగా చిదంబరం ప్రస్తావనకు తెచ్చారు. ‘ఆర్‌బీఐ గవర్నర్ సూచన నాకు నచ్చింది. ఇది సరైన ధోరణే. ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని నిర్దేశించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. వృద్ధి పెంపు, ధరల కట్టడి లక్ష్యాలు నెరవేర్చడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ కలిసి పనిచేస్తాయనడంలో ఎటువంటి సందేహాలూ అక్కర్లేదు’ అని చిదంబరం ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఆయన పేర్కొన్న ముఖ్యాంశాలు ఇవీ...
18 నెలల క్రితంతో పోల్చితే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. 2013-14లో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తితో పోల్చితే 4.6 శాతానికి కట్టడి చేయగలం. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) 40 బిలియన్ డాలర్లలోపే ఉంటుంది.
క్యాడ్ తుది గణాంకాలు పరిశీలించాక పసిడి దిగుమతులపై ఆంక్షలను సమీక్షించడం జరుగుతుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధన కేటాయింపు విషయంలో కొత్త, వినూత్న మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు షేర్ల జారీ, మైనారిటీ షేర్‌హోల్డర్లకు రైట్స్ ఇష్యూ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
త్వరలో కొత్త బ్యాంక్ లెసైన్సులు: రాజన్
ఇదే సమావేశంలో పాల్గొన్న రాజన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ అనుమతితో కొద్ది వారాల్లో కొత్త బ్యాంక్ లెసైన్సులను జారీ చేయడం జరుగుతుందని వివరించారు. కాగా,మూలధనం విషయంలో బ్యాంకులు బాసెల్ 3 నిబంధనలను పాటించడానికి సంబంధించి ఒక అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటయ్యింది.