వాషింగ్టన్ : అమెరికాలోని భారతీయులు తమ సంపాదనలో ఎక్కువభాగం పిల్లల చదువులకోసం పొదుపుచేస్తున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. సుమారు 33 శాతం మంది భారతీయ అమెరికన్లు తమ పిల్లల కాలేజీ చదువులకోసం ఆర్నెల్లకుపైగా వేతనాన్ని దాచుకుంటున్నట్లు తెలిపారు. పిల్లల చదువులకు కావాల్సినంత డబ్బు సమకూర్చుకోవడం, రిటైర్‌మెంట్ తర్వాత కుటుంబం ఆర్థికంగా ఒడిదుడుకులకు లోనుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం .. ఈ రెండూ ఇక్కడి భారతీయ అమెరికన్ల ముఖ్యలక్ష్యాలని అధ్యయనం తెలిపింది.
మసాచూసెట్స్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ముఖ్యమైన ఈ రెండు అవసరాలకోసం తమ సంపాదనలో ఎక్కువమొత్తాన్ని పక్కనపెట్టాల్సి రావడంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నాయని, అంతేకాక కాలేజీల ఫీజులు భారీగా ఉన్న ప్రస్తుత తరుణంలో కుటుంబంలో పిల్లలందరి చదువులను నెట్టుకురావడం కూడా వారికి పెద్ద సవాలుగా మారిందని అధ్యయనం వెల్లడించింది. కాగా, ముసలితనంలో తమ పిల్లలకు భారం కాకూడదని 70 శాతం మంది భావిస్తున్నారు.