భారత జాలర్లు వస్తే కాల్చేస్తాం: లంక ప్రధాని
కొలంబో: లంక సముద్ర జలాల్లోకి భారత జాలరులు ప్రవేశిస్తే వారిని షూట్ చేస్తామని శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే హెచ్చరించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చేవారం శ్రీలంక పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉత్తర లంక ప్రజల జీవనోపాధిని భారత జాలర్లు కొల్లగొడుతున్నారని ‘తంతి టీవీ’ అనే తమిళ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు.
‘ఎవరైనా నా ఇంట్లోకి దౌర్జన్యంగా జొరబడేందుకు ప్రయత్నిస్తే నేను వారిని కాల్చేస్తా. అందుకు చట్టం నన్ను అనుమతిస్తుంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నాకు సంబంధించినంతవరుకు నాకు కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇవి మా జలాలు. ఇందులో చేపలు పట్టుకునేందుకు జాఫ్నా జాలర్లను అనుమతించాలి. వారిని అడ్డుకోవడం వల్లనే భారత్ నుంచి జాలర్లు ఇక్కడికొస్తున్నారు. పైగా మనతో భారత జాలర్లు ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదిస్తున్నారు. అందుకు అభ్యంతరం లేదుగానీ ఉత్తర లంక జాలర్ల ప్రయోజనాలను మాత్రం పణంగా పెట్టలేం. అది కుదరనే కుదరదు’ అని అన్నారు.
గత కొన్నేళ్ల కాలంలో దాదాపు 600 మంది భారత జాలర్లను లంక నావికాదళ సిబ్బంది హతమార్చినట్టు వచ్చిన ఆరోపణల గురించి ప్రశ్నించగా, ‘ఇటీవలి కాలంలో మాత్రం అలాంటి సంఘటనలు జరుగలేదు. 2011లో మాత్రం అలాంటి ఓ సంఘటన జరిగినట్టు గుర్తు. గతంలో ఎల్‌టీటీఈ మిలిటెంట్లకు ఆయుధాలు అందజేసేందుకు భారత్ నుంచి వచ్చేవారు’ అని ఆయన చెప్పారు.