Ranil Wickramesinghe
-
భారత్‌తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నా
కొలంబో: భారత్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నట్లు శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమసింఘే(57) తెలిపారు. దేశం కనీవినీ ఎరుగని కష్టకాలంలో ఉన్న సమయంలో ఆర్థికంగా చేయూత అందిస్తున్న భారత్‌కు, ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని భారత్ పేర్కొంది. శ్రీలంకకు సాయం కొనసాగిస్తామని భరోసా ఇచ్చింది. అధ్యక్షుడు గొటబయా కార్యాలయం ఎదుట నెల రోజులుగా సాగుతున్న నిరసనలను విరమింపజేస్తానని విక్రమసింఘె అన్నారు. అయితే ఆయన మధ్యంతర ప్రభుత్వం కొనసాగాలంటే గొటబయా గద్దె దిగాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ, జేవీపీ డిమాండ్ చేశాయి. కొత్త ప్రభుత్వంలో భాగస్వాములు కాబోమని, బయటి నుంచి మద్దతిస్తామని గొటబయాకు చెందిన ఎస్‌ఎల్‌పీపీలోని ఓ వర్గం, మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ, మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరుమణ (జేవీపీ) స్పష్టం చేశాయి. 2020 పార్లమెంట్ ఎన్నికల్లో విక్రమసింఘే ఎన్నిక కానందున ఆయన ప్రభుత్వానికి చట్టబద్ధత లేదని ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ వ్యాఖ్యానించింది. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్లో యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)కి చెందిన విక్రమసింఘే ఒక్కరే సభ్యుడు. మరోవైపు, నిట్టంబువ పట్టణంలో ఈ నెల 10వ తేదీన జరిగిన ఘర్షణల సమయంలో ఎస్ఎల్పీపీకి చెందిన ఎంపీ అమరకీర్తి(57)ది ఆత్మహత్య చేసుకున్నారంటూ వచ్చిన వార్తలు నిజం కాదని పోలీసులు తెలిపారు. ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు ఆయన్ను దారుణంగా కొట్టి చంపినట్లు వెల్లడించారు. -
భారత జాలర్లు వస్తే కాల్చేస్తాం: లంక ప్రధాని
కొలంబో: లంక సముద్ర జలాల్లోకి భారత జాలరులు ప్రవేశిస్తే వారిని షూట్ చేస్తామని శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే హెచ్చరించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చేవారం శ్రీలంక పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉత్తర లంక ప్రజల జీవనోపాధిని భారత జాలర్లు కొల్లగొడుతున్నారని ‘తంతి టీవీ’ అనే తమిళ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆరోపించారు. ‘ఎవరైనా నా ఇంట్లోకి దౌర్జన్యంగా జొరబడేందుకు ప్రయత్నిస్తే నేను వారిని కాల్చేస్తా. అందుకు చట్టం నన్ను అనుమతిస్తుంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నాకు సంబంధించినంతవరుకు నాకు కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇవి మా జలాలు. ఇందులో చేపలు పట్టుకునేందుకు జాఫ్నా జాలర్లను అనుమతించాలి. వారిని అడ్డుకోవడం వల్లనే భారత్ నుంచి జాలర్లు ఇక్కడికొస్తున్నారు. పైగా మనతో భారత జాలర్లు ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదిస్తున్నారు. అందుకు అభ్యంతరం లేదుగానీ ఉత్తర లంక జాలర్ల ప్రయోజనాలను మాత్రం పణంగా పెట్టలేం. అది కుదరనే కుదరదు’ అని అన్నారు. గత కొన్నేళ్ల కాలంలో దాదాపు 600 మంది భారత జాలర్లను లంక నావికాదళ సిబ్బంది హతమార్చినట్టు వచ్చిన ఆరోపణల గురించి ప్రశ్నించగా, ‘ఇటీవలి కాలంలో మాత్రం అలాంటి సంఘటనలు జరుగలేదు. 2011లో మాత్రం అలాంటి ఓ సంఘటన జరిగినట్టు గుర్తు. గతంలో ఎల్టీటీఈ మిలిటెంట్లకు ఆయుధాలు అందజేసేందుకు భారత్ నుంచి వచ్చేవారు’ అని ఆయన చెప్పారు.