కొలంబో: భారత్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నట్లు శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమసింఘే(57) తెలిపారు. దేశం కనీవినీ ఎరుగని కష్టకాలంలో ఉన్న సమయంలో ఆర్థికంగా చేయూత అందిస్తున్న భారత్‌కు, ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని భారత్ పేర్కొంది. శ్రీలంకకు సాయం కొనసాగిస్తామని భరోసా ఇచ్చింది.
అధ్యక్షుడు గొటబయా కార్యాలయం ఎదుట నెల రోజులుగా సాగుతున్న నిరసనలను విరమింపజేస్తానని విక్రమసింఘె అన్నారు. అయితే ఆయన మధ్యంతర ప్రభుత్వం కొనసాగాలంటే గొటబయా గద్దె దిగాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ, జేవీపీ డిమాండ్ చేశాయి. కొత్త ప్రభుత్వంలో భాగస్వాములు కాబోమని, బయటి నుంచి మద్దతిస్తామని గొటబయాకు చెందిన ఎస్‌ఎల్‌పీపీలోని ఓ వర్గం, మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ, మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరుమణ (జేవీపీ) స్పష్టం చేశాయి.
2020 పార్లమెంట్ ఎన్నికల్లో విక్రమసింఘే ఎన్నిక కానందున ఆయన ప్రభుత్వానికి చట్టబద్ధత లేదని ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ వ్యాఖ్యానించింది. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్‌లో యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)కి చెందిన విక్రమసింఘే ఒక్కరే సభ్యుడు. మరోవైపు, నిట్టంబువ పట్టణంలో ఈ నెల 10వ తేదీన జరిగిన ఘర్షణల సమయంలో ఎస్‌ఎల్‌పీపీకి చెందిన ఎంపీ అమరకీర్తి(57)ది ఆత్మహత్య చేసుకున్నారంటూ వచ్చిన వార్తలు నిజం కాదని పోలీసులు తెలిపారు. ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు ఆయన్ను దారుణంగా కొట్టి చంపినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment