ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరక్టర్‌గా భారతీయురాలైన పూనం ఖేత్రపాల్ సింగ్ ఎన్నికయ్యారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరక్టర్‌గా భారతీయురాలైన పూనం ఖేత్రపాల్ సింగ్ ఎన్నికయ్యారు. 44ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారతీయులకు ఈ పదవి దక్కడం ఇదే ప్రథమం. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరక్టర్‌గానున్న థాయ్‌లాండ్ వాసి సామ్లీ ప్లియాన్‌బాంగ్‌చాంగ్ పదేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో ఎన్నిక నిర్వహించారు.
డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా విభాగంలోనున్న 11 దేశాల (భారత్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, శ్రీలంక, మాల్దీవులు, తిమోర్ లెస్టే, దక్షిణ కొరియా) ఆరోగ్య మంత్రుల సమావేశంలో పూనం ఎన్నికను గురువారం అధికారికంగా ప్రకటించారు.
పూనం ప్రస్తుతం సుస్థిరాభివృద్ధి, ఆరోగ్యకరమైన పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా, డైరక్టర్ జనరల్ కేబినెట్ సభ్యురాలిగా జెనీవాలోని డబ్ల్యూహెచ్‌వో కార్యాలయంలో పనిచేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, ఇలాంటి అత్యున్నత పదవికి భారతీయ మహిళ ఎన్నికకావడం డబ్యూహెచ్‌వో కీలక భాగస్వామిగా భారత్ ఆరోగ్యం, అభివృద్ధి రంగాల్లో బహుముఖ పాత్ర పోషించడానికి మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు.