'నిత్యం తగలబడుతున్న గ్రామం'గా పేరుమోసిన ఝరియాలో చీకటి బతుకులను చిత్రీకరించిన ఫొటోగ్రాఫర్ రోని సేన్ కు ప్రఖ్యాత గెట్టి ఇన్ స్టాగ్రామ్ అవార్డు లభించింది.
గడిచిన 100 ఏళ్లుగా కణకణ మండిపోతూ ప్రపంచ ప్రకృతి వింతల్లో ఒకటిగా నిలిచిన ఈ బొగ్గుగని జార్ఖండ్ లోని ఝరియా అనే ఊళ్లో ఉంది. ' నిత్యం తగలబడుతున్న గ్రామం'గా పేరుమోసిన ఈ ఊరిలో బతకలేక చాలామంది ఏళ్ల కిందటే వలసవెళ్లిపోయారు. ఏ దిక్కూలేని కొద్ది మంది మాత్రం బొగ్గుల కుంపటినే ఆధారం చేసుకుని జీవిస్తున్నారు. మండే బొగ్గు విడుదలచేసే ప్రమాదకరమైన వాయువుల కారణంగా చర్మవ్యాధులు, ఇతర సమస్యలకు లోనవుతున్నారు. ఇక్కడి మహిళల్లో చాలామంది గనుల్లో పడిఉన్న బొగ్గును ఏరుకుంటూ కనిపిస్తారు. (తప్పక చదవండి: నిత్యం తగలబడుతున్న గ్రామం)
రకరకాల కారణాలతో వెనుకబాటుకు గురై, హీనస్థితిలో బతుకీడుస్తున్న వీరిపై అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలే ఇండియన్ ఫొటోగ్రాఫర్ రోని సేన్ ఝరియా వాసులపై రూపొందించిన ఫొటో ఆల్బంకు ప్రఖ్యాత గెట్టి ఇన్ స్టాగ్రామ్ అవార్డు లభించింది. ఈ అవార్డుకింది ఆయనకు 10వేల అమెరికన్ డాలర్లు ఇస్తారు. భయంకరమైన పరిస్థితుల మధ్య బతుకీడుస్తూ ఎలాంటి గుర్తిపునకు నోచుకోలేనివారి కథనాలను ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశ్యంతో 'గెట్టి ఇమేజెస్' సంస్థ అవార్డులు అందిస్తోంది.
'ఝరియా బొగ్గుగనుల్లో చీకటిసూర్యుల కథలను ప్రపంచం ముందు ఉంచుతున్నందుకు గర్వంగా ఉంది. కొందరికి వేరే దారిలేక ఇక్కడుంటున్నారేతప్ప ఝరియా అసలు నివాసయోగ్యమేకాదు. ఏళ్లుగా ప్రభుత్వాలు హామీఇస్తున్నా.. ఇక్కడివాళ్లకు పునరావాసం దొరకనేలేదు. నా ఫొటోలతోనైనా ఝరియా ప్రజల జీవితాలు బాగుపడితే సంతోషిస్తా'అని అంటున్నాడు రోనీ సేన్.