ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ చర్చల్లో కాశ్మీర్ అంశం లేవనెత్తరాదన్న భారత్ షరతు తమకు అంగీకారం కాదని పాకిస్థాన్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ స్పష్టం చేశారు. ఆఫ్ఘానిస్తాన్ తో చర్చల నేపథ్యంలో సెనేట్ స్టాండింగ్ కమిటీతో సోమవారం ఇస్లామాబాద్‌లో సమావేశమైన సందర్భంగా అజీజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు భారత్ అంగీకరిస్తే అందుకు అనుగుణంగా పాక్ పనిచేస్తుందని కమిటీ సభ్యులతో అజీజ్ అన్నట్లు ఓ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం భారత్, పాకిస్థాన్ కాకుండా కాశ్మీర్‌కు మరో అవకాశం లేదన్నారు.
భారత బలగాల దాడిలో 14 మంది తమ దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 65 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆయన పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలే ముందుగా సరిహద్దు ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. భారత్ లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాకిస్తాన్ శత్రుత్వం పెట్టుకునేందుకు యత్నిస్తోందని అజీజ్ తెలిపారు.