ఐటీఐఆర్‌తో మారుతున్న ఆదిభట్ల | Information Technology Investment Region boom Adibatla realty | Sakshi
Sakshi News home page

ఐటీఐఆర్‌తో మారుతున్న ఆదిభట్ల

Published Sat, Dec 7 2013 5:39 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

ఐటీఐఆర్‌తో మారుతున్న ఆదిభట్ల - Sakshi

ఐటీఐఆర్‌తో మారుతున్న ఆదిభట్ల

 సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఐటీ అంటే కేవలం గచ్చిబౌలి ప్రాంతమే. కానీ, ఐటీ టెక్నాలజీ పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపడంతో ఆదిభట్ల, ఉప్పల్, పోచారం, మహేశ్వరంలోనూ పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు రానున్నాయి. మొత్తం 50 వేల ఎకరాల పరిధిలో మూడు క్లస్టర్లలో విస్తరించే ఐటీఐఆర్‌ను 25 ఏళ్లలో (2013 నుంచి 2038 వరకూ) రెండు దశల్లో అభివృద్ధి చేస్తారు.  క్లస్టర్ -2లో భాగంగా 79.2 చ.కి.మీ. విస్తీర్ణంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ (మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం) ప్రాంతాల్లో ఐటీఐఆర్ విస్తరించి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో బడా బడా నిర్మాణ సంస్థలు కొత్త వెంచర్లు, ప్రాజెక్ట్‌లను ప్రారంభించాయి. వీటితో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఆదిభట్లలో తమ సంస్థలను స్థాపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎత్తై భవనాలు, ఐటీ సంస్థల కార్యాలయాలు, విశాలమైన రోడ్లు, లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు.. ఇలా హైటెక్ సొబగులద్దుకుంటున్న ఆదిభట్లపై ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది..
 
ఐటీ కంపెనీలకు చిరునామా: ఇప్పటికే ఆదిభట్లలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లాకిడ్‌మార్టిన్, టాటా స్కిరోస్కి తదితర మల్టీ నేషనల్ కంపెనీలు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. పలు కంపెనీలు ఇప్పటికే నిర్మాణ పనుల్ని ప్రారంభించాయి. త్వరలోనే ఆదిభట్ల చుట్టుపక్కల గ్రామాల్లో లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు రానున్నారు. దీంతో ఈ ప్రాంతం హైటెక్ హంగుల్ని సంతరించుకుంటుంది. 80 ఎకరాల్లో విస్తరించి ఉన్న టీసీఎస్‌లో సుమారు 50 ఐటీ సంస్థలు రానున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. టీసీఎస్‌లో దాదాపు 8 బ్లాకులు రెడీ అవుతున్నాయి. టీసీఎస్‌ను ఆనుకొని ఎకరం భూమి రూ. 3.30 కోట్లు పలుకుతోంది. హైవేకు దూరంగా ఉన్నా రూ. 2 కోట్లకు తక్కువ ధర పలకటం లేదంటే ఇక్కడి అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు. మరో ఆరేడు నెలల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు రియల్టర్లు చెబుతున్నారు. ఆదిభట్ల ప్రాంతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 10 కి.మీ., ఎల్బీనగర్‌కు 12 కి.మీ., ఔటర్ రింగ్ రోడ్డుకు 1.5 కి.మీ. దూరంలో ఉండటంతో ఈ ప్రాంతాల్లో కూడా రియల్ వ్యాపారం ఊపందుకుంది.
 
అందరి చూపూ ఇక్కడే: ఐటీఐఆర్ రాకతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిభట్ల ప్రాంతంపై రియల్టర్లు, ఎన్నారైలు, ఐటీ ఉద్యోగులు అందరి చూపు పడింది. ప్రత్యేకించి ఐటీ కంపెనీల రాకతో  స్థిరాస్తి సంస్థలు ఈ ప్రాంతంలో దృష్టి సారించాయి. పోటీలు పడుతూ రియల్ వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. ధరలు కూడా అందుబాటులో ఉండటం, మెరుగైన రవాణా, మౌలిక వసతులు పుష్కలంగా ఉండటంతో ఐటీ ఉద్యోగులు, మదుపుదారులు, ఎన్నారైలు ఈ ప్రాంతంలో స్థలాలు కొనేందుకు ఎగబడుతున్నారు. ఆదిభట్ల చుట్టుపక్కల ప్రాంతాలైన మంగల్‌పల్లి, కొంగర, రావిర్యాల, ఇంజాపూర్, గుర్రంగూడ వంటి ప్రాంతాల్లోనూ రియల్ వ్యాపారం ఊపందుకుంది. భారీ వెంచర్లు వెలుస్తున్నాయి. రెండు మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో మెయిన్‌రోడ్డును ఆనుకుని ఉండే స్థలం సైతం గజం ధర రూ. 3 వేలకు అటుఇటుగా ఉండేది. కానీ, ప్రస్తుతం రూ. 8 వేల నుంచి రూ. 10 వేల మధ్య పలుకుతోంది.
 
ధరలూ అందుబాటులోనే: ఆదిభట్లలో మెయిన్‌రోడ్డుకు కాస్త దూరంగా వేస్తున్న వెంచర్లలో ఇప్పటికీ ధరలు అందుబాటులోనే ఉన్నాయి. మెట్రోసిటీ డెవలపర్స్ ‘ఏరో ఎన్‌క్లేవ్’ పేరుతో ఓపెన్ ప్లాట్స్‌ను అభివృద్ధి చేస్తోంది. ఫేజ్-1లో 3 ఎకరాలు, ఫేజ్-2లో 12 ఎకరాలను ఇప్పటికే విక్రయించింది. ప్రస్తుతం ఫేజ్-3లో భాగంగా 15 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నారు. గజం స్థలం ధర రూ. 4 వేల నుంచి రూ. 4,500లుగా చెబుతున్నారు. ఆదిభట్లకు 3 కి.మీ. దూరంలో ఉన్న బొంగ్లూరులో ఇదే సంస్థ 48 ఎకరాల్లో ‘మెట్రోసిటీ మెగా ప్రాజెక్ట్’ పేరుతో 500 ఇండిపెండెంట్ హౌస్‌లను నిర్మిస్తోంది. ధర రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలు చెబుతున్నారు. ఆదిభట్లకు 6 కి.మీ. దూరంలోని బడంగ్‌పేటలో 14 ఎకరాల్లో ‘మెట్రోసిటీ మెగాహిల్స్’ పేరుతో 200 ఇండిపెండెంట్ హౌస్‌లను నిర్మిస్తోంది. ధర రూ. 22 లక్షలు.
 
ఆదిభట్లలో శ్రీశ్రీ గృహ నిర్మాణ్ ఇండియా ప్రై.లి. 10 ఎకరాల్లో ‘ఏరో పార్క్’, 18 ఎకరాల విస్తీర్ణంలో ‘ఏరో లైట్స్’ హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన లే అవుట్లను అభివృద్ధి చేస్తోంది. గజం ధర రూ. 6 వేల నుంచి రూ. 15 వేలుగా చెబుతున్నారు. ఇదే సంస్థ బొంగ్లూరులో ‘శ్రీశ్రీ అంతఃపురం’ పేరుతో భారీ నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది. ధర రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షలుగా చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement