
ఇంటర్నెట్ సేఫ్టీపై ఇక పాఠం!
న్యూఢిల్లీ: సురక్షిత ఇంటర్నెట్ వినియోగాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు ప్రముఖ సంస్థ గూగుల్ నడుం బిగించింది. ఇందుకు గాను నాలుగైదు రాష్ట్రాలతో ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభించింది. అమెరికా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ఇప్పటికే గోవా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని ఆ రాష్ట్ర విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. ఆ రాష్ట్రంలోని 460 మంది టీచర్లకు శిక్షణనిచ్చి, ఎనబై వేల మంది విద్యార్థులకు అవగాహన కల్పించనుంది. ఫిబ్రవరి 7న (మంగళవారం) సురక్షిత ఇంటర్నెట్ డేగా పాటిస్తున్నట్లు ఆ సంస్థ గూగుల్ ఇండియా డైరెక్టర్(ట్రస్ట్ సేఫ్టీ) సునితా మొహంతి తెలిపారు.
మైక్రోసాఫ్ట్ సంస్థ 14 దేశాల్లో జరిపిన ఓ సర్వేలో 63శాతం మంది భారతీయులు ఆన్‌లైన్ వ్యవహారాలు ప్రమాదకరమని భావిస్తున్నట్లు తేలిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తాము సేఫ్టీ ఇంటర్నెట్ ఆవశ్యకతను గుర్తించినట్లు వివరించారు. ఆన్‌లైన్‌లో వేధింపులు, సైబర్ నేరాలు, విద్వేషపూరిత ప్రసంగాలు తదితర విపరీత ధోరణుల బారిన పడకుండా ఎలా రక్షణ పొందాలో తాము నేర్పుతామన్నారు.