
పన్నీర్ దీక్ష.. కంటతడి పెట్టిన మహిళలు
జయలలిత అనుమానాస్పద మరణంపై సీబీఐ లేదా న్యాయ విచారణకు ఆదేశించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మరణంపై సీబీఐ లేదా న్యాయ విచారణకు ఆదేశించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం సరిగ్గా 10 గంటలకు పన్నీర్‌సెల్వం దీక్షలను ప్రారంభించారు. పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షా శిబిరం నుంచి చేసిన ప్రసంగాల్లో అమ్మ పాలనను వివరిస్తుండగా పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకం, ముఖ్యంగా మహిళలు కన్నీరు పెట్టారు.
పన్నీర్ మద్దతుదారులు సైతం తమిళనాడులోని 32 జిల్లాల్లో నిరాహార దీక్షలు జరిపారు. రాజకీయాలు, పార్టీ, పదవులకు దూరంగా ఉంటానని లిఖిత పూర్వకంగా జయ వద్ద క్షమాపణలు కోరిన శశికళ నేడు ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దీక్షా శిబిరం నుంచి పన్నీర్ చేసిన ప్రసంగంలో దుయ్యబట్టారు. పార్టీ నుంచి బహిష్కృతులైన వారి కబంద హస్తాల నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడేందుకే ధర్మయుద్ధాన్ని ప్రారంభించానని ఆయన తెలిపారు. అమ్మ అడ్మిటైన నాటి నుంచి మరణించే వరకు 74 రోజులపాటూ ఆసుపత్రికి వెళుతున్నా ఒక్కరోజు కూడా జయను చూసేందుకు అవకాశం లేకుండా అడ్డుకున్నారని, విదేశాలకు పంపి మెరుగైన చికిత్స చేయిద్దామని తాను సూచించినా శశికళ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
జయ ఆరోగ్య పరిస్థితిపై తనకు క్రమం తప్పకుండా సమాచారం ఇచ్చానని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ చేసిన ప్రకటన అవాస్తవమని, ఆయన ఆ ప్రకటనను ఉపసంహరించుకోకుంటే కోర్టులో కేసు దాఖలు చేస్తానని పన్నీర్ సెల్వం హెచ్చరించారు. జయ మరణంలోని మర్మంపై కేంద్ర ప్రభుత్వ పరిధిలో న్యాయ విచారణ లేదా సీబీఐ విచారణ జరిపించాలని తాను కోరుతున్నానని అన్నారు. పన్నీర్ సెల్వం దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన లభించింది.
జయకు అపోలో ఆసుపత్రిలో అందించిన పలురకాల చికిత్సలకు ముందు అనుమతి పత్రాలు మరణ ధ్రువీకరణ పత్రం స్వీకరణకు సంతకాలు పెట్టిన వారి పేర్లు బయటపెట్టాలని ఆమె మేనకోడలు ఎంజీఆర్ అమ్మ దీప పేరవై అధినేత్రి దీపా జయకుమార్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. జయ మరణంపై నెలకొన్న అనుమానాల నివృత్తి కోసం న్యాయ విచారణ అవసరమని ఆమె అన్నారు.