'ఒక్క ట్యాబ్లో రెండు స్క్రీన్లు.. చిత్రంలో సిత్రం'
చేతిలో ఒక్కటే ట్యాబ్.. ఒక్కటే ఫోన్.. వాటికి ఉండేది ఒక్కటే స్క్రీన్.. కానీ, వాటిల్లో రెండు స్క్రీన్ లు ఉంటే, ఓ పక్క వీడియో చూస్తూనే దానికి ఎలాంటి భంగం కలగకుండా అదే స్క్రీన్ పై మరో పక్క నెట్ ఆన్ చేసుకునే అవకాశం వస్తే.. మొబైల్, ట్యాబ్ వర్షన్లలో నిత్యం కొత్త ప్రయోగాలు చేస్తూ అగ్రస్థానంలో నిలిచిన ఆపిల్ సంస్థ మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ట్యాబ్, మొబైల్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
సాధారణంగా ఒక యాప్ ద్వారా ఒక అంశాన్ని వెతుకుతూ ఉండి మధ్యలో వేరేది అవసరం ఉంటే తిరిగి వెనకకు వెళ్లి మరో యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే, ఇకపై అలాంటి అవసరమే లేకుండా నేరుగా ఒక ట్యాబ్ స్క్రీన్ను రెండు విభాగాలుగా(స్ప్లిట్) చేసుకొని బహుళ(మల్టీటాస్క్) కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఐఓఎస్ 09 ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త మోడల్ ఐఓఎస్ 09 ల ద్వారా ట్యాబ్స్లలో రెండు యాప్లను ఒకేసారి రన్ చేసుకోవచ్చు. ఒక ఐపాడ్పై ఇలాంటి వెసులు బాటు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.
అయితే, ఇది కేవలం ఆపిల్ ఐపాడ్ ఎయిర్ 2, ఐపాడ్ ప్రో, ఐపాడ్ మిని 4 లో మాత్రమే సాధ్యమవుతుంది. ఉదాహరణకు ఒకసారి ట్యాబ్ ఆన్ చేసి ఏదైనా యాప్ ద్వారా ఓ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడూ మధ్యలో మరో అంశం కావాల్సి వస్తే అదే స్క్రీన్ పై కుడిపక్కన ఉండే ఆప్షన్(స్ప్లిట్ వ్యూ) ను క్లిక్ చేయడం ద్వారా మొత్తం స్క్రీన్ లోని మూడో వంతు భాగం దానంతట అదే రెండో యాప్ కోసం ఓపెన్ అవుతుంది.
దీంతో మనకు రెండు ప్రోగ్రాంలు ఒకే స్క్రీన్ పై పక్కపక్కనే చూసుకుంటూ తేలికగా వేగంగా పని పూర్తి చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇలా ఫొటోలు, వీడియోలు కూడా పక్కపక్కనే చూసే అవకాశం కలుగుతుంది. దీంతోపాటు ప్రతి అంశాన్ని కూడా అదే తెరపై పెద్దగా చిన్నగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓ పక్క వీడియోలు చూస్తూనే దానికి ఏమాత్రం భంగం కలగకుండా మరోపక్క ఇంటర్నెట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉన్న ఈ ఐఓఎస్ 09 అమితంగా ఆకర్షించనుంది.