
ఐపీఎస్ బాలసుబ్రమణ్యంకు క్లీన్‌చిట్
ముంబై: సొహ్రబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రమణ్యంకు ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. సొహ్రబుద్దీన్‌ను ఎన్‌కౌంటర్ పేరిట చంపేయడంలో బాలసుబ్రమణ్యం, ఆయన కింది అధికారి గుజరాత్ పోలీసులకు సహాయపడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. అయితే ఇందుకు తగిన ఆధారాలు లేవంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎం.బి.గోసావి సోమవారం అభియోగాలను కొట్టివేశారు.
గ్యాంగ్‌స్టర్ అయిన సోహ్రబుద్దీన్‌కు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయనేది గుజరాత్ పోలీసుల అభియోగం. 2005లో సొహ్రబుద్దీన్, అతని భార్య కౌసర్‌బీ మహారాష్ట్రలోని సాంగ్లీకి వెళుతుండగా... హైదరాబాద్ సమీపంలో వీరిని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు పట్టుకెళ్లారని ఆరోపణలున్నాయి. 2005లో గాంధీనగర్ దగ్గర్లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో సొహ్రబుద్దీన్‌ను పోలీసులు కాల్చిచంపారు.