
బర్త్ డే పార్టీ కూడా నేరమే!
అమ్మాయిలు అబ్బాయిల కలిసి బర్తడే పార్టీ చేసుకున్న కారణంగా 150 మందిని అరెస్ట్ చేశారు..
అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ చుట్టూ జరుపుకొనే బర్త్ డే పార్టీలకు లెక్కే ఉండదు. అమ్మాయిలు సైతం పాల్గొనే అలాంటి పార్టీలను పోలీసులు కూడా లైట్ తీసుకుంటారు. ఒక వేళ పట్టించుకున్నా.. అక్కణ్నుంచి వెళ్లిపొమ్మంటారే తప్ప దురుసుగా ప్రవర్తించరు. ఇలాంటి బర్త్ డే సెలబ్రేషన్ స్పాట్ లు ఊరికి ఒకటో రెండో తప్పక ఉంటాయి. అవునుమరి..మనది భారతదేశం. అదే ఇరాన్ లో పరిస్థితి వేరేలా ఉంటుంది. విషయం అరెస్టులు, కొరడా దెబ్బలదాకా వెళుతుంది!
ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు ఉత్తరాన ఇస్లామ్ షహర్ అనే ప్రాంతం ఉంది. అక్కడి పార్కులో సోమవారం(జులై 25న) ఓ బర్త్ డే పార్టీ జరిగింది. అమ్మాయిలు, అబ్బాయిలూ అంతా కలిసి ఓ 150 మంది ఆ వేడుకకు హాజరయ్యారు. ఎంచక్కా కేక్ తింటూ, ముచ్చట్లు చెప్పుకుంటున్నవారిపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అందరినీ అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు! ప్రజలకు ఇష్టం ఉన్నా, లేకున్నా ఇరాన్ పాలకులు అమలు చేస్తోన్న షరియత్ చట్టాల ప్రకారం అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వేడుకల్లో పాల్గొనకూడదు. ఆ నిబంధనను మీరారంటూ గతంలోనూ పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలమేరకు కొరడా దెబ్బల శిక్షలు విధించారు.