ఈ మానవుడు... విమానయానవుడు! | Iron Man Richard Browning is a real- life Tony Stark | Sakshi
Sakshi News home page

ఈ మానవుడు... విమానయానవుడు!

Published Sat, Apr 1 2017 5:14 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

ఈ కుడిచేతి ఇంజిన్లతోనే రిచర్డ్‌ బ్రౌనింగ్‌ గాల్లోకి ఎగురుతున్నాడు!

ఈ కుడిచేతి ఇంజిన్లతోనే రిచర్డ్‌ బ్రౌనింగ్‌ గాల్లోకి ఎగురుతున్నాడు!

హాలీవుడ్‌ సినిమా ఐరన్‌మ్యాన్‌ చూశారా మీరు? అందులో హీరో టోనీ స్టార్క్‌. ప్రత్యేకమైన సూట్‌ ఒకటి తయారు చేసుకుని దాంతో గాల్లోకి ఎగిరేస్తాడు. అంతేకాదు, అతడు చేయి విదిలిస్తే చాలు.. బాంబులు పేలుతూంటాయి! సూట్‌తోనే హీరో ఇంకా ఎన్నెన్నో హీరోయిజమ్స్‌ ప్రదర్శిస్తూంటాడు. ఇలాంటిది తనకూ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్నాడో ఏమో బ్రిటన్‌కు చెందిన రిచర్డ్‌ బ్రౌనింగ్‌.. ఇదిగో ఈ ఫొటోల్లో చూపినట్లు తానూ ఎగిరే యంత్రాలను సిద్ధం చేసేసుకున్నాడు. విజయవంతంగా వాటిని పరీక్షించాడు కూడా. రిచర్డ్‌ చేతులకు, కాళ్లకు  అతుక్కుని కనిపిస్తున్నవి మినీ విమానం ఇంజిన్లు. కుడిచేతిలో ఉంచుకున్న యాక్సెలరేటర్‌ను తిప్పితే చాలు.. మనిషి మొత్తం పైకి ఎగురుతాడు. తొలి ప్రయత్నంలో రిచర్డ్‌ కేవలం అరమీటరు ఎత్తు మాత్రమే ఎగరగలిగినా ఆ తరువాత నెమ్మదిగా అతడు ఇంకొంచెం ఎక్కువ ఎత్తుకు ఎగరగలిగాడు.

సెకన్లలో ముగిసిన తొలి ప్రయాణం ఇప్పుడు దాదాపు 12 నిమిషాల కంటే ఎక్కువ సమయం కొనసాగుతోంది. రిచర్డ్‌ అభివృద్ధి చేసిన సూట్‌లో ఆరు ఇంజిన్లు ఉంటాయి. మొత్తం బరువు 130 కిలోలు. ఈ సూట్‌ను తగిలించుకుని అరచేతుల్ని నేలవైపు చూపితే చాలు.. నిట్టనిలువుగా పైకి ఎగరవచ్చునని అంటున్నాడు రిచర్డ్‌. ఈ మధ్య తనకు సోనీ కంపెనీ ఒక డిస్‌ప్లే యూనిట్‌ను సరఫరా చేసిందని, దీని ద్వారా ఇంజిన్లలో ఇంధనం ఎంతుంది, ఎంత ఎత్తు ఎగిరామో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని చెబుతున్నాడు. ఐరన్‌మ్యాన్‌ సినిమా తరహా సూట్‌ తయారు చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది అంటున్న రిచర్డ్‌ ఎప్పటికైనా దాన్ని తాను తయారు చేస్తానని కూడా అంటున్నాడు. తనంతట తాను బ్యాలెన్స్‌ చేసుకోగల సామర్థ్యంతో తయారయ్యే ఈ సూట్‌తో గంటకు 450 కిలోమీటర్ల వేగంతో  గాల్లోకి దూసుకెళ్లవచ్చునని రిచర్డ్‌ అంచనా వేస్తున్నాడు. ఈ సూట్‌కు ప్రఖ్యాత గ్రీక్‌ ఇన్వెంటర్‌ డెడులస్‌ పేరు పెట్టే ఆలోచనలో ఉన్నాడు రిచర్డ్‌.
 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
                                
‘ఐరన్‌మ్యాన్‌’ చిత్రంలోని హీరో సూట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement