మునియమ్మాళ్ ఫిర్యాదు అందిందా? | is Muniyammal claim reaches high court on encounter her husband ? | Sakshi
Sakshi News home page

మునియమ్మాళ్ ఫిర్యాదు అందిందా?

Published Tue, Apr 14 2015 4:01 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM

మునియమ్మాళ్ ఫిర్యాదు అందిందా? - Sakshi

మునియమ్మాళ్ ఫిర్యాదు అందిందా?

శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు తన భర్త శశికుమార్‌ను చంపారంటూ మృతుని భార్య మునియమ్మాళ్ ఇచ్చిన ఫిర్యాదు అందిందా?

* కేసు నమోదు చేశారా?
* శేషాచలం ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి
* ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
* పోలీసులు ఇష్టారాజ్యంగా మాట్లాడొద్దు
* విచారణ ఈ నెల 15కు వాయిదా

 
 సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు తన భర్త శశికుమార్‌ను చంపారంటూ మృతుని భార్య మునియమ్మాళ్ ఇచ్చిన ఫిర్యాదు అందిందా? అందితే దాని ఆధారంగా కేసు నమోదు చేశారా? లేదా? అని హైకోర్టు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ఈ ఎన్‌కౌంటర్ గురించి పోలీసులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారం గురించి తమ చర్యలను సమర్థించుకునే విధంగా పోలీసులు మాట్లాడటం ఎంత మాత్రం సమంజసం కాదని తేల్చి చెప్పింది.
 
 ఈ కేసు దర్యాప్తు గురించి గానీ, ఇతర విషయాల గురించి వారు నోరు తెరవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఒకవేళ అలా కాదని మాట్లాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. సంబంధిత కోర్టు, సంబంధిత అధికారి ముందు తప్ప, పోలీసు శాఖలో ఏ స్థాయి అధికారి కూడా దర్యాప్తు గురించి గానీ, దాని ఫలితం గురించి మాట్లాడబోరని, ఆ మేర తగిన సూచనలు చేస్తానంటూ అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఇచ్చిన హామీని ధర్మాసనం రికార్డు చేసుకుంది. దర్యాప్తు గురించి మాట్లాడకుండా మౌనం వహించడం వల్ల దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం ఉంటుందని, ఇది ప్రజలకు పోలీసులపై విశ్వాసం పెరిగేందుకు దోహదపడుతుందని ధర్మాసనం తెలిపింది. 20 మంది ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
 
 ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించి న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫున వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంబంధీకులు ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదని ఈ కోర్టు ప్రశ్నించిందని, ఈ నేపథ్యంలో మృతుల్లో ఒకరైన శశికుమార్ భార్య మునియమ్మాళ్ చంద్రగిరి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారంటూ, ఆ ఫిర్యాదు కాపీని ధర్మాసనం ముందుంచారు. తన భర్తతో పాటు బస్సులో వెళుతున్న ఇతర కూలీలను పట్టుకొచ్చి కాల్చి చంపారని, బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఆమె ఫిర్యాదులో కోరారని తెలిపారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన ధర్మాసనం, అయితే తాము సుమోటోగా మునియమ్మాళ్‌ను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరుస్తున్నామని తెలిపింది. మరి ఈ ఫిర్యాదు పోలీసులకు అందిందా? కేసు నమోదు చేశారా? అని అదనపు ఏజీని ప్రశ్నించింది. దీనిపై తగిన వివరాలు తెలుసుకుని చెబుతానని అదనపు ఏజీ శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. ఫిర్యాదు అందింది కాబట్టి, ఈ నేపథ్యంలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని తాము ఆశిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఆ వెంటనే పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
 
 వాస్తవం బయటకు రావాలి
 ‘ఏ పోలీసు అధికారైనా సరే ఈ కేసు దర్యాప్తు గురించి ఏ విషయాన్నీ బహిర్గతం చేయకూడదు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దర్యాప్తునకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయకుండా పోలీసులను నియంత్రించదలిచాం. దానికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తాం. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మీడియా పని మీడియా చేస్తుంది. అది వారి వృత్తి. వారికి చట్ట పరిధుల మేర స్వేచ్ఛ ఉంది. దర్యాప్తు విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అయితే ఇష్టానుసారం మాట్లాడేందుకు మాత్రం వారికి స్వేచ్ఛ లేదు. వాస్తవం బయటకు రావడమే మాకు కావాల్సింది.
 
 న్యాయసాయం కోసం ఫిర్యాదుదారు (మునియమ్మాళ్) ఎప్పుడైనా హైకోర్టును ఆశ్రయింవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేస్తూ ఆ మేర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మునియమ్మాళ్‌ను ప్రతివాదిగా చేరుస్తున్నామని, ఆమెకు నోటీసులు జారీ చేస్తున్నామని, ఆ నోటీసులను హైకోర్టు రిజిస్ట్రీ స్పీడ్ పోస్టు ద్వారా చిత్తూరు జిల్లా జడ్జికి పంపాలని, వాటిని జిల్లా జడ్జి ఫిర్యాదుదారు చిరునామాకు చేరేలా చూడాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. న్యాయవాది ద్వారా న్యాయసాయం అందుతుందన్న విషయాన్ని మునియమ్మాళ్‌కు తెలియచేయాలని రఘునాథ్‌కు ధర్మాసనం తెలిపింది. ఒకవేళ ఆమె న్యాయసాయం కావాలంటే, ఆమెకు ఓ మంచి న్యాయవాదిని ఏర్పాటు చేయాలని న్యాయ సేవాధికార సంస్థను ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement