రైలు ప్రమాదాలు: ఐఎస్ఐ ఏజెంటు అరెస్టు
రైలు ప్రమాదాలు: ఐఎస్ఐ ఏజెంటు అరెస్టు
Published Tue, Feb 7 2017 10:53 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
భారతదేశంలో వరుసపెట్టి మూడు రైలు ప్రమాదాలు సంభవించి పలువురు మరణించారు. ఈ మూడు ప్రమాదాలకు కారణం రైలు పట్టాల మీద పేలుడు పదార్థాలు పెట్టడమేనని అనుమానాలున్నాయి. సరిగ్గా ఇదే కేసులో ప్రధాన నిందితుడు, పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంటు అయిన షమ్సుల్ హుడాను నేపాల్‌లో అరెస్టు చేశారు. దేశంలో జరిగిన వరుస రైలు ప్రమాదాల కేసులను విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇతడిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. నవంబర్ నెలలో కాన్పూర్‌లో జరిగిన రైలుప్రమాదంలో ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పడంతో 150 మంది మరణించారు.
ఈ కేసులో హుడా హస్తం ఉందని భావిస్తున్నారు. అతడి ఆదేశాల మేరకే ఈ రైలు వెళ్లే మార్గంలో పట్టాల మీద బాంబులు పెట్టారని, గ్యాస్ కట్టర్లతో పట్టాలు కోవారని అంటున్నారు. ఇటీవల జరిగిన అన్ని రైలు ప్రమాదాల వెనక ఐఎస్ఐ హస్తం ఉందని చెబుతున్నారు. బిహార్‌లో మోతీ పాశ్వాన్, ఉమాశంకర్ పటేల్, ముఖేష్ యాదవ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, విచారించగా అప్పుడు షమ్సుల్ హుడా పాత్ర బయటపడింది. బిహార్‌లోని మోతిహారీ ప్రాంతంలో జరిగిన ఇద్దరు యువకుల హత్యకేసులో వాళ్లను విచారించగా, రైలు ప్రమాదాల కోణం అనుకోకుండా బయటకు వచ్చింది. నేపాల్‌కు చెందిన బ్రిజ్ కిశోర్ గిరి అనే వ్యక్తి కూడా రైలు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్నాడు. హుడా అతడికి చెప్పి, ఇద్దరు యువకులతో బాంబులు పెట్టించాడని అంటున్నారు. వాళ్లు బాంబులు పెడుతూ దొరికిపోవడంతో బిహార్‌కు చెందిన ముగ్గురితో ఆ ఇద్దరిని హుడా చంపించాడు. ఈ మొత్తం వ్యవహారం అంతా బిహారీల అరెస్టుతో బయటపడింది.
Advertisement
Advertisement