ఇసుజు తొలి దేశీ ఎస్‌యూవీ
-
రూ.3,000 కోట్లతో శ్రీ సిటీలో తయారీ కేంద్రం
-
2016 మార్చి నాటికి తొలి యూనిట్ పూర్తి
-
మొదటి దశలో ఉత్పత్తి సామర్థ్యం 50,000 యూనిట్లు
-
భారత్‌లో తయారైన ‘ఎంయూ-7’ ఎస్‌యూవీ విడుదల
-
చెన్నై ఎక్స్‌షోరూం ధర రూ. 22.3 లక్షలు
-
2016 నాటికి 60 డీలర్‌షిప్‌లు
-
ఎస్‌యూవీ, ఎల్‌సీవీలపైనే ప్రధానంగా దృష్టి...
-
ఇసుజు ఇండియా ఎండీ టకాషి కికుచి వెల్లడి
చెన్నై నుంచి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: దేశీయంగా బాగా డిమాండ్ ఉన్న స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ), తేలికపాటి వాణిజ్య వాహనాల (ఎల్‌సీవీ)పై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం ఇసుజు ప్రకటించింది. ఇందుకోసం దేశీయంగా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, వివిధ సంస్థలతో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు ఇసుజు ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ టకాషి కికుచి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
రూ.3,000 కోట్ల పెట్టుబడి అంచనాతో శ్రీసిటీలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, మొదటి దశలో 50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఇది 2016 నాటికి అందుబాటులోకి వస్తోందన్నారు. మొత్తం యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం లక్ష యూనిట్లని, పూర్తి సామర్థ్యం అందుబాటులోకి వస్తే పొరుగు దేశాలతో పాటు మధ్యప్రాచ్య దేశాలకు ఇక్కడ నుంచే ఎగుమతి చేయనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ సిటీ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అందిస్తున్న సహాయ సహకారాలు బాగున్నాయని, ప్రధానంగా ఎస్‌యూవీ, ఎల్‌సీవీ వాహనాల ఉత్పత్తిపైనే దృష్టిసారిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యూనిట్ గురించి ఇంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేమన్నారు.
భారతీయ అవసరాలకు అనుగుణంగానే...
దేశీయంగా తయారు చేసిన మొదటి ఎస్‌యూవీ వెహికల్ ‘ఎంయూ-7’ను టకాషి మంగళవారం లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత మూడేళ్ళ నుంచి దేశీయ మార్కెట్‌ను పరిశీలించిన తర్వాత ఇక్కడి అవసరాలకు అనుగుణంగా ఎంయూ-7 ఎస్‌యూవీను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.
ఎంయూ-7 ధర రూ.22.3 లక్షలు ..
దేశీయంగా తయారు చేసిన ఎంయూ-7 ధరను రూ.22.3 లక్షలుగా (చెన్నై ఎక్స్ షోరూం) నిర్ణయించినట్లు ఇసుజు ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షిగేరు వకబయాషి తెలిపారు. బీఎస్-4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఎస్‌యూవీ మూడు రంగుల్లో లభిస్తుందని, ఏటా 5,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. చెన్నైలోని హిందుస్థాన్ మోటార్స్‌లో ఈ వాహనాలను తయారు చేస్తున్నామని, శ్రీసిటీ యూనిట్ వచ్చినా ఈ ఒప్పందం కొనసాగుతుందని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపైనే దృష్టిసారిస్తున్నామని, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంతో సహా ప్రస్తుతం 8 డీలర్‌షిప్స్ ఉన్నాయని, వీటి సంఖ్యను వచ్చే మూడేళ్లలో 60కి పెంచనున్నట్లు తెలిపారు.