రెండేళ్లలో ఇసుజు వాహనాల ఉత్పత్తి
తొలి దశలో 50 వేల వాహనాల తయారీ
సిటీలో ప్లాంటుకు సీఎం శంకుస్థాపన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలోని శ్రీసిటీలో నెలకొల్పుతున్న ప్లాంటులో వచ్చే రెండేళ్లలో వాహనాల ఉత్పత్తి ప్రారంభిస్తామని జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం ఇసుజు మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ టకాషి కికుచి తెలిపారు. ఇందులో ప్రధానంగా పికప్ ట్రక్స్, ఎస్‌యూవీలను ఉత్పత్తి చేస్తామన్నారు. శ్రీసిటీలో ఇసుజు మోటార్స్ తలపెట్టిన ప్లాంటుకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారమిక్కడ లాంఛనంగా శంకుస్థాపన చేశారు. స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా ఇసుజుకు ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కంపెనీకి అన్నివిధాలా సహాయం అందిస్తామని ఆయన హామీనిచ్చారు. అవగాహన ఒప్పందం కుది రిన తొమ్మిది నెలల్లోనే ప్లాంటు పనులు ప్రారంభం కావడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇసుజుకు సంబంధించి ఈ ప్లాంటులో తయారైన వాహనాన్నే తాను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తయారీ రంగానికి ప్రోత్సాహమిచ్చేలా రాష్ట్రంలో తయారీ జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండటాన్ని సీఎం ప్రస్తావించారు. మరోవైపు, వాహన పరిశ్రమకు కావాల్సిన విధంగా కార్మికులకు శిక్షణనిచ్చేందుకు ఉద్దేశించిన ట్రైనింగ్ కిట్‌ను ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మకు ఇసుజు యాజమాన్యం అందించింది.
రూ. 3 వేల కోట్ల పెట్టుబడి..
శ్రీసిటీ ప్లాంటుపై 2020 నాటికి రూ.3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఇసుజు ఇండియా ప్రెసిడెంట్ కికుచి తెలియజేశారు. ఏటా 1.20 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని, 2016 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని, తొలి దశలో 50 వేల యూనిట్లు ఉత్పత్తి చేస్తామని తెలియజేశారు. వీటిలో ఉపయోగించే విడిభాగాల్లో దాదాపు 70 శాతాన్ని ప్రారంభదశలో స్థానిక సంస్థల నుంచే తీసుకుంటామన్నారు. దీని ద్వారా స్థానికంగా 2,000-3,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. భారత్‌లో ఈ జాయింట్ వెంచర్‌లో మిత్సుబిషికి 38 శాతం, ఇసుజు మోటార్స్‌కి 62 శాతం వాటా ఉంటుంది. ప్రస్తుతం తమకు నాలుగు డీలర్‌షిప్‌లు ఉండగా.. త్వరలో వైజాగ్, తిరుపతి తదితర ప్రాంతాల్లో మరో నాలుగు డీలర్‌షిప్‌లు ఆరంభిస్తామని కికుచి చెప్పారు.