Isuzu Motors
-
ఇసుజు డీ-మ్యాక్స్ ఆంబులెన్స్: ధర ఎంతంటే..
ఇసుజు మోటార్స్ ఇండియా ఏఐఎస్-125 టైప్ సీ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా 'డీ-మ్యాక్స్ అంబులెన్స్' లాంచ్ చేసింది. ఈ అంబులెన్స్ రోగులను తరలించే సమయంలో భద్రతను అందించేలా తయారైంది. దీని ప్రారంభ ధర రూ. 25.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌లో RZ4E 1.9-లీటర్, 4-సిలిండర్ వీజీఎస్ టర్బో ఇంటర్‌కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 120 కేడబ్ల్యు పవర్, 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ అంబులెన్స్ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తగిన విధంగా ఉండేలా దృఢంగా నిర్మితమై ఉంది.ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌లో.. ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ఇంటలిజెంట్ బ్రేక్ ఓవర్-రైడ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా డ్రైవర్ అండ్ కో-డ్రైవర్ సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్స్, సీట్ బెల్ట్ వార్ణింగ్ సిస్టమ్, డ్రైవర్ & కో-డ్రైవర్ కొరకు ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ క్యాబిన్ కొరకు కొలాప్సిబుల్ స్టీరింగ్ కాలమ్, సైడ్ ఇంట్రూషన్ ప్రొటక్షన్ బీమ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌ను కంపెనీ రోగుల అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసింది. కాబట్టి ఇందులో వార్నింగ్ లైట్లు, ఫ్లాషర్లు, సైరన్లు, సైడ్ లైట్లు, సులభంగా గుర్తించడానికి అనుకూలంగా ఉండేలా హై-విజిబిలిటీ స్టిక్కర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. రెండో రోజు తగ్గిన ధరలుడీ-మ్యాక్స్ అంబులెన్స్ లాంచ్ సందర్భంగా ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ 'టోరు కిషిమోటో' మాట్లాడుతూ.. అత్యాధునిక ఫీచర్లతో దీనిని లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఇసుజు ఎప్పుడూ నమ్మకం, విశ్వసనీయతకు పర్యాయపదంగా ఉంది. ఈ లాంచ్‌తో, ఇసుజు మోటార్స్ ఇండియా ఆటోమోటివ్ పరిశ్రమలో గేమ్ ఛేంజర్‌గా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంతుందని అన్నారు. -
ఇసుజు కార్ల ప్లాంట్ విస్తరణ
వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): శ్రీసిటీలోని జపనీస్ యుటిలిటీ వాహన తయారీదారు ఇసుజు మోటార్స్ ఇండియా పరిశ్రమలో అదనపు ఉత్పత్తుల యూనిట్‌ను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కంపెనీ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరో యఖియామా, ఇసుజు మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టోరూ నకాటా, మిట్సుబిషి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఈఓ ఇవారో టోయిడి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని రూ. 400కోట్ల పెట్టుబడులతో అదనపు ఉత్పత్తి కేంద్రంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌షాప్ సదుపాయం, ఇంజన్ అసెంబ్లింగ్ యూనిట్లను ప్రారంభించారు. ఈ రెండవ దశ కార్యకలాపాల ప్రారంభం భారత్‌లోని ఇసుజు ప్రయాణంలో అతి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని జపాన్ కాన్సుల్ జనరల్ తెలిపారు. అంతర్జాతీయ తయారీ కేంద్రాలలో ఒకటిగా ఈ ప్లాంటును తీర్చిదిద్దడానికి ఇసుజు చేస్తున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. అనివార్య పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయిన రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పంపిన అభినందన సందేశాన్ని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చదివి వినిపించారు. మంత్రి తన సందేశంలో ఇసుజుకు అన్నివిధాలా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు, భరోసా ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఆటో మొబైల్ తయారీకి ఇసుజు ఒక ప్రామాణికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి కార్ల పరిశ్రమ ఇసుజు అంటూ శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. టోరూ నకాటా మాట్లాడుతూ.. పోటీ మార్కెట్లో అత్యుత్తమ శ్రేణి ఉత్పత్తులు, సేవలను అందించడానికి ఇసుజు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల నాణ్యత, విశ్వసనీయతకు భరోసా అందిస్తామన్నారు. రెండవ దశ కార్యకలాపాలు తమ వృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ సామర్థ్యాన్ని విస్తరించనుందని పేర్కొన్నారు. -
ఎస్ఎంఎల్ ఇసుజు నుంచి గ్లోబల్ సిరీస్ ట్రక్కులు
బెంగళూరు: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఎస్ఎంఎల్ ఇసుజు దక్షిణ భారతదేశ మార్కెట్లో అధునాతన టెక్నాలజీతో రూపొందించిన లారీలను శుక్రవారం విడుదల చేసింది. ప్రస్తుత భారత లారీ పరిశ్రమకు సరిగ్గా సరిపడే విధంగా గ్లోబల్ సిరీస్ (జీఎస్) టక్కులను ప్రవేశపెట్టినట్లు వెల్లడించిన ఈ సంస్థ.. తమ నూతన టెక్నాలజీ ద్వారా రియల్–టైమ్ వాహన ట్రాకింగ్, వ్యయ నియంత్రణ, ఉత్తమ లోడింగ్ సామర్థ్యం వంటి ప్రయోజనాలు ఉన్నట్లు వివరించింది. ఈ సందర్భంగా కంపెనీ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. ‘అత్యంత అధునాతన రోబోటిక్ టెక్నాలజీతో వాహనాలు రూపుదిద్దుకున్నాయి. ఎస్ఎంఎల్ సారతి పేరిట అందిస్తున్న టెలిమాటిక్స్ సొల్యూషన్ ఆన్ రోడ్ సర్వీస్ వంటి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. లారీ క్యాబిన్ సైతం డ్రైవర్‌కు మరింత సౌకర్యంగా ఉంది.’ అని వివరించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ లారీలను పూర్తిస్థాయిలో ఇక్కడే ఉత్పత్తి చేయనున్నట్లు తెలియజేశారు. -
వి-క్రాస్ బుకింగ్స్ ప్రారంభించిన ఇసుజు
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన కంపెనీ ‘ఇసుజు మోటార్స్’ తన యుటిలిటీ వెహికల్ ‘డి-మ్యాక్స్ వి-క్రాస్’ బుకింగ్స్‌ను సోమవారం ప్రారంభించింది. దీని ధర రూ.12.49 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ చెన్నై) ఉంది. వాహన డెలివరీ జూలై నుంచి ఉంటుందని కంపెనీ పేర్కొంది. అడ్వెంచర్, స్టైల్, యుటిలిటీ ప్రత్యేకతలను కోరుకుంటున్న వారికి త మ వెహికల్ సరిగ్గా సరిపోతుందని వివరించింది. ‘వి-క్రాస్’లో సీఆర్డీఐ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, వంటి ప్రత్యేకతలు ఉన్నాయని పేర్కొంది. -
ఇసుజు నుంచి ఎంయు-7 ఆటోమేటిక్ వేరియంట్
ధర రూ.23.9 లక్షలు న్యూఢిల్లీ : ఇసుజు మోటార్స్ ఇండియా కంపెనీ తన స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్, ఎంయు-7 మోడల్లో ఆటోమేటిక్ వేరియంట్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.23.9 లక్షలని(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కంపెనీ ఎండీ నవోహిరో యమగుచి చెప్పారు. ఎంయు-7 మోడల్‌ను 2013 డిసెంబర్లో మార్కెట్లోకి తెచ్చామని వివరించారు. మార్కెట్ అవసరాలకనుగుణంగా ఈ ఆటోమేటిక్ వేరియంట్‌ను అందించామని, ఈ వేరియంట్‌కు మంచి స్పందన లభించగలదని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ ఎంయు-7 ఎస్‌యూవీని కంప్లీట్లీ నాక్డ్ డౌన్(సీకేడీ) కిట్ల రూపంలో దిగుమతి చేసుకొని హిందుస్తాన్ మోటార్స్‌కు చెందిన చెన్నై సమీపంలోని తిరువల్లూర్ ప్లాంట్‌లో కంపెనీ అసెంబుల్ చేస్తోంది. -
రెండేళ్లలో ఇసుజు వాహనాల ఉత్పత్తి
తొలి దశలో 50 వేల వాహనాల తయారీ సిటీలో ప్లాంటుకు సీఎం శంకుస్థాపన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలోని శ్రీసిటీలో నెలకొల్పుతున్న ప్లాంటులో వచ్చే రెండేళ్లలో వాహనాల ఉత్పత్తి ప్రారంభిస్తామని జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం ఇసుజు మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ టకాషి కికుచి తెలిపారు. ఇందులో ప్రధానంగా పికప్ ట్రక్స్, ఎస్‌యూవీలను ఉత్పత్తి చేస్తామన్నారు. శ్రీసిటీలో ఇసుజు మోటార్స్ తలపెట్టిన ప్లాంటుకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారమిక్కడ లాంఛనంగా శంకుస్థాపన చేశారు. స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా ఇసుజుకు ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కంపెనీకి అన్నివిధాలా సహాయం అందిస్తామని ఆయన హామీనిచ్చారు. అవగాహన ఒప్పందం కుది రిన తొమ్మిది నెలల్లోనే ప్లాంటు పనులు ప్రారంభం కావడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇసుజుకు సంబంధించి ఈ ప్లాంటులో తయారైన వాహనాన్నే తాను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తయారీ రంగానికి ప్రోత్సాహమిచ్చేలా రాష్ట్రంలో తయారీ జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండటాన్ని సీఎం ప్రస్తావించారు. మరోవైపు, వాహన పరిశ్రమకు కావాల్సిన విధంగా కార్మికులకు శిక్షణనిచ్చేందుకు ఉద్దేశించిన ట్రైనింగ్ కిట్‌ను ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మకు ఇసుజు యాజమాన్యం అందించింది. రూ. 3 వేల కోట్ల పెట్టుబడి.. శ్రీసిటీ ప్లాంటుపై 2020 నాటికి రూ.3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఇసుజు ఇండియా ప్రెసిడెంట్ కికుచి తెలియజేశారు. ఏటా 1.20 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని, 2016 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని, తొలి దశలో 50 వేల యూనిట్లు ఉత్పత్తి చేస్తామని తెలియజేశారు. వీటిలో ఉపయోగించే విడిభాగాల్లో దాదాపు 70 శాతాన్ని ప్రారంభదశలో స్థానిక సంస్థల నుంచే తీసుకుంటామన్నారు. దీని ద్వారా స్థానికంగా 2,000-3,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. భారత్‌లో ఈ జాయింట్ వెంచర్లో మిత్సుబిషికి 38 శాతం, ఇసుజు మోటార్స్‌కి 62 శాతం వాటా ఉంటుంది. ప్రస్తుతం తమకు నాలుగు డీలర్‌షిప్‌లు ఉండగా.. త్వరలో వైజాగ్, తిరుపతి తదితర ప్రాంతాల్లో మరో నాలుగు డీలర్‌షిప్‌లు ఆరంభిస్తామని కికుచి చెప్పారు. -
2018 నాటికి పూర్తి స్వదేశీ వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ రూ.3 వేల కోట్లతో శ్రీసిటీలో నెలకొల్పుతున్న ప్లాంటు 2016కల్లా సిద్ధం కానుంది. కంపెనీ ప్రస్తుతం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు, పిక్ అప్ ట్రక్‌లను థాయ్‌లాండ్ నుంచి తెప్పించి భారత్‌లో విక్రయిస్తోంది. కొత్త ప్లాంటు ద్వారా 2018 నాటికి పూర్తి స్వదేశీ పరికరాలతో వాహనాలు తయారవుతాయని ఇసుజు మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ టకషి కికుచి గురువారం తెలిపారు. తద్వారా పోటీ ధరలో మోడళ్లను విక్రయించేందుకు వీలవుతుందని చెప్పారు. ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ఎంయూ-7ను హైదరాబాద్‌లో తొలి వినియోగదారునికి అందజేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్యూవీ, పిక్ అప్ ట్రక్లపైనే ప్రధానంగా దృష్టి పెడతామని కంపెనీ డిప్యూటీ ఎండీ షిగెరు వకబయషి తెలిపారు. ఇతర దేశాల్లో ఇసుజు విక్రయిస్తున్న తేలికపాటి వాణిజ్య వాహనాలు, మధ్యంతర వాణిజ్య వాహనాలను భారత్‌లో ప్రవేశపెట్టడంపై అధ్యయనం చేస్తున్నట్టు ఆయన వివరించారు. భారత వాహన పరిశ్రమ పరిమాణం ప్రస్తుతమున్న 35 లక్షల యూనిట్ల నుంచి 2020 నాటికి 1 కోటి యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. కాగా, హైదరాబాద్ ఎక్స్ షోరూంలో ఎంయూ-7 ధర రూ.22.6 లక్షలుగా ఉంటుంది. -
ఇసుజు తొలి దేశీ ఎస్యూవీ
రూ.3,000 కోట్లతో శ్రీ సిటీలో తయారీ కేంద్రం 2016 మార్చి నాటికి తొలి యూనిట్ పూర్తి మొదటి దశలో ఉత్పత్తి సామర్థ్యం 50,000 యూనిట్లు భారత్‌లో తయారైన ‘ఎంయూ-7’ ఎస్యూవీ విడుదల చెన్నై ఎక్స్‌షోరూం ధర రూ. 22.3 లక్షలు 2016 నాటికి 60 డీలర్‌షిప్‌లు ఎస్యూవీ, ఎల్సీవీలపైనే ప్రధానంగా దృష్టి... ఇసుజు ఇండియా ఎండీ టకాషి కికుచి వెల్లడి చెన్నై నుంచి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: దేశీయంగా బాగా డిమాండ్ ఉన్న స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ), తేలికపాటి వాణిజ్య వాహనాల (ఎల్సీవీ)పై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం ఇసుజు ప్రకటించింది. ఇందుకోసం దేశీయంగా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, వివిధ సంస్థలతో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు ఇసుజు ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ టకాషి కికుచి ‘సాక్షి’తో పేర్కొన్నారు. రూ.3,000 కోట్ల పెట్టుబడి అంచనాతో శ్రీసిటీలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, మొదటి దశలో 50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఇది 2016 నాటికి అందుబాటులోకి వస్తోందన్నారు. మొత్తం యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం లక్ష యూనిట్లని, పూర్తి సామర్థ్యం అందుబాటులోకి వస్తే పొరుగు దేశాలతో పాటు మధ్యప్రాచ్య దేశాలకు ఇక్కడ నుంచే ఎగుమతి చేయనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ సిటీ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అందిస్తున్న సహాయ సహకారాలు బాగున్నాయని, ప్రధానంగా ఎస్యూవీ, ఎల్సీవీ వాహనాల ఉత్పత్తిపైనే దృష్టిసారిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యూనిట్ గురించి ఇంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేమన్నారు. భారతీయ అవసరాలకు అనుగుణంగానే... దేశీయంగా తయారు చేసిన మొదటి ఎస్యూవీ వెహికల్ ‘ఎంయూ-7’ను టకాషి మంగళవారం లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత మూడేళ్ళ నుంచి దేశీయ మార్కెట్‌ను పరిశీలించిన తర్వాత ఇక్కడి అవసరాలకు అనుగుణంగా ఎంయూ-7 ఎస్యూవీను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఎంయూ-7 ధర రూ.22.3 లక్షలు .. దేశీయంగా తయారు చేసిన ఎంయూ-7 ధరను రూ.22.3 లక్షలుగా (చెన్నై ఎక్స్ షోరూం) నిర్ణయించినట్లు ఇసుజు ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షిగేరు వకబయాషి తెలిపారు. బీఎస్-4 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఎస్యూవీ మూడు రంగుల్లో లభిస్తుందని, ఏటా 5,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. చెన్నైలోని హిందుస్థాన్ మోటార్స్‌లో ఈ వాహనాలను తయారు చేస్తున్నామని, శ్రీసిటీ యూనిట్ వచ్చినా ఈ ఒప్పందం కొనసాగుతుందని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపైనే దృష్టిసారిస్తున్నామని, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంతో సహా ప్రస్తుతం 8 డీలర్షిప్స్ ఉన్నాయని, వీటి సంఖ్యను వచ్చే మూడేళ్లలో 60కి పెంచనున్నట్లు తెలిపారు.