2018 నాటికి పూర్తి స్వదేశీ వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ రూ.3 వేల కోట్లతో శ్రీసిటీలో నెలకొల్పుతున్న ప్లాంటు 2016కల్లా సిద్ధం కానుంది. కంపెనీ ప్రస్తుతం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు, పిక్ అప్ ట్రక్‌లను థాయ్‌లాండ్ నుంచి తెప్పించి భారత్‌లో విక్రయిస్తోంది. కొత్త ప్లాంటు ద్వారా 2018 నాటికి పూర్తి స్వదేశీ పరికరాలతో వాహనాలు తయారవుతాయని ఇసుజు మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ టకషి కికుచి గురువారం తెలిపారు. తద్వారా పోటీ ధరలో మోడళ్లను విక్రయించేందుకు వీలవుతుందని చెప్పారు. ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ఎంయూ-7ను హైదరాబాద్‌లో తొలి వినియోగదారునికి అందజేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్‌యూవీ, పిక్ అప్ ట్రక్‌లపైనే ప్రధానంగా దృష్టి పెడతామని కంపెనీ డిప్యూటీ ఎండీ షిగెరు వకబయషి తెలిపారు.
ఇతర దేశాల్లో ఇసుజు విక్రయిస్తున్న తేలికపాటి వాణిజ్య వాహనాలు, మధ్యంతర వాణిజ్య వాహనాలను భారత్‌లో ప్రవేశపెట్టడంపై అధ్యయనం చేస్తున్నట్టు ఆయన వివరించారు. భారత వాహన పరిశ్రమ పరిమాణం ప్రస్తుతమున్న 35 లక్షల యూనిట్ల నుంచి 2020 నాటికి 1 కోటి యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. కాగా, హైదరాబాద్ ఎక్స్ షోరూంలో ఎంయూ-7 ధర రూ.22.6 లక్షలుగా ఉంటుంది.