ఆయన జీవితాన్ని తెరకెక్కిస్తాను: ఆమిర్
సినిమా పరిశ్రమలో రాణించి స్టార్‌గా ఎదుగాలంటే ఎవరో ఒకరి ప్రోత్సాహాం, ప్రభావం లేదా స్పూర్తి ఉండాల్సిందే. బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్ సూపర్‌స్టార్‌గా ఎదగడానికి స్వతంత్ర సమరయోధుడు, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ కారణమట. తాను సినీ పరిశ్రమలో ప్రముఖుడిగా ఎదగడానికి తమ కుటుంబానికి తమ దగ్గరి బంధువు ఆజాద్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని అమీర్ స్వయంగా ఇటీవల వెల్లడించారు.
తన బాబాయి నాసిర్ హుస్సేన్ హిందీ చిత్ర పరిశ్రమలో రచయితగా ప్రవేశించాలని తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించిన సమయంలో ఆజాద్ వెన్నుతట్టి.. ‘నీకు నచ్చిన పనిని నీవు చేయి.. ఎవరి మాట వినకు’ అని బాసటగా నిలిచారని అమీర్ తెలిపారు.
ఆజాద్ అందించిన ప్రోత్సాహాంతోనే తన బాబాయి, తన తండ్రిలో తాహీర్ హుస్సేన్‌లు సినీ పరిశ్రమలో రాణించారని తెలిపారు. ఆజాద్ సలహాను పాటించకపోతే తన బాబాయ్, తండ్రి, తాను ఎక్కడ ఉండేవాళ్లమో అని అమీర్ అన్నారు. నీకు నచ్చిన పనినే చేయమని ఆజాద్ చెప్పిన ఫిలాసఫీ తనను ఆకట్టుకుందని.. తన ‘3 ఇడియెట్స్’ చిత్రానికి ఆయన చెప్పిన మాటలే మూల కథ అని అమీర్ తెలిపారు.
భవిష్యత్‌ను ఊహించడంలో ఆజాద్‌ను మించిన వారు మరొకరు ఉండరని కితాబిచ్చారు. భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందని ఆజాద్ ఓ సంవత్సరం ముందే ఊహించడం అబ్బురపరిచిందన్నారు. త్వరలోనే ఆజాద్ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తాను అని అమీర్ వెల్లడించారు.