నందిని కుటుంబానికి అమ్మ సాయం
చెన్నై: జీతం సొమ్మును లాక్కేళ్తున్న దొంగలను పట్టుకునే క్రమంలో మృత్యు ఒడిలోకి చేరిన ఉపాధ్యాయిని నందిని, దొంగల మోటారు సైకిల్ ఢీకొనడంతో మరణించిన శేఖర్ కుటుంబాలకు ముఖ్యమంత్రి జయలలిత సానుభూతి తెలియజేశారు. ఆ ఇద్దరి కుటుంబాలకు తలా రూ.మూడు లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
ఇదే ఘటనలో గాయపడ్డ నజ్జూకు మెరుగైన వైద్యసేవలకు ఆదేశిస్తూ, రూ.లక్ష సాయం అందజేయనున్నారు. ఈ నెల నాలుగో తేదిన పట్టినపాక్కంలో శ్రీనివాసపురానికి చెందిన ఉపాధ్యాయిని నందిని (24), బంధువు నజ్జూలు ఏటీఎంలో జీతం డ్రా చేసి మోటారు సైకిల్‌పై వస్తుండగా, మరో మోటారు బైక్ మీద అతి వేగంగా దూసుకొచ్చిన ఇద్దరు వారి బ్యాగ్‌ను లాక్కేళ్లారు. వారిని వెంటాడి పట్టుకునే క్రమంలో కింద పడ్డ నందిని సంఘటనా స్థలంలో మరణించింది.
ఆ దొంగలు తప్పించుకునే క్రమంలో అతి వేగంగా దూసుకెళ్తూ, శేఖర్ అనే వృద్ధుడ్ని ఢీకొట్టారు. ఈ దొంగల కారణంగా ఇద్దరు సంఘటనా స్థలంలో మరణించారు. నజ్జూ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ నేపథ్యంలో మృతి చెందిన ఆ ఇద్దరి కుటుంబాలకు తన సానుభూతిని సీఎం జయలలిత తెలియజేశారు.
ఈ ఘటన తనను ఎంతో వేదనకు గురి చేసిందంటూ అమ్మ జయలలిత తన సానుభూతి ప్రకటనలో వివరించారు. నందిని, శేఖర్‌ల కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తూ, ఆ కుటుంబాలకు తలా రూ. మూడు లక్షలు చొప్పున సాయాన్ని ప్రకటించారు. అలాగే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నజ్జూకు మెరుగైన వైద్య సేవల్ని అందించాలని ఆదేశించారు. నజ్జూ వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష సాయాన్ని ప్రకటించారు. చదవండి....(వెంటాడిన ప్రాణం!)