
శశికళ చేయడం బాధ కలిగించింది
- అంత్యక్రియలపై ‘సాక్షి’తో జయలలిత అన్న కూతురు దీప
- జయ మృతి వెనక ఆంతరంగిక విషయాలున్నాయి
- త్వరలోనే వాటిని బయటపెడతాను
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలను శశికళ చేయడం తనకు బాధ కలిగించిందని జయలలిత అన్న కూతురు దీప పేర్కొన్నారు. ఓ మహిళ అంత్యక్రియలు నిర్వహించడం తాను ఇంతవరకు చూడలేదన్నారు. ఆమె బుధవారం ‘సాక్షి’టీవీతో మాట్లాడుతూ.. తన మేనత్త జయలలిత మృతి విషయంలో అనేక ఆంతరంగిక విషయాలున్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని చెప్పారు. గతంలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో అపోలో ఆస్పత్రి వద్ద దీప హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. జయలలితకు స్వయానా సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మి దంపతుల కూతురు దీప. జయకుమార్ దంపతులు కొన్నాళ్లు జయలలితతో పాటు పోయెస్‌గార్డెన్‌లో ఉండేవారు. దీప ఆ ఇంట్లోనే పుట్టింది.
ఆ తర్వాత అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు రావడంతో జయకుమార్ పోయెస్‌గార్డెన్ వదిలి చెన్నై టీనగర్‌లో కాపురం పెట్టారు. 1995లో జయకుమార్ మృతి చెందగా జయలలిత ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. 2013లో వదిన చనిపోరుునప్పుడు మాత్రం జయలలిత వెళ్లలేదు. ఇటీవల జరిగిన మేనకోడలు దీప వివాహానికి కూడా ఆమె హాజరుకాలేదు. దీంతో వధూవరులే జయలలిత ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకొనివచ్చారు. ఈ సందర్భంగా వధూవరులకు అత్త హోదాలో జయలలిత ఒక ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చినట్లు సమాచారం. కాగా, మరోవైపు దీప వైవాహిక జీవితం కొన్నాళ్లు సజావుగా సాగినా ఆ తర్వాత భర్తతో విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.
దీంతో ఆమె అత్త జయలలితకు చేరువకావాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఇటీవల జయ ఇంటి వద్ద ఆమె గంటసేపు నిరీక్షించినా అనుమతి రాలేదు. ‘పోయెస్‌గార్డెన్‌లోని ఈ ఇల్లు మా నానమ్మ(జయలిత తల్లి సంధ్య) నాకు రాసిచ్చింది. మా ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు మీరెవరు?’అంటూ దీప ఆ సందర్భంలో సెక్యూరిటీ అధికారులతో ఘర్షణ పడింది. మా నాన్న కుటుంబీకులు అత్తకు దగ్గర కావడం పోయెస్‌గార్డెన్‌లోని కొందరికి ఇష్టం లేదంటూ శశికళపై పరోక్ష ఆరోపణలు కూడా చేసింది. జయలలితే తనను రాజకీయ వారసురాలిగా ప్రకటించాలని గతంలో దీప ప్రయత్నాలు చేసింది. కానీ అవి సఫలం కాలేదు. జయలలిత మృతి నేపథ్యంలో రాజకీయ వారసురాలిగా మళ్లీ తెరపైకి వచ్చేందుకు దీప ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.