దీపకు పేరవై చిచ్చు
► తప్పుకున్న మాధవన్
► మద్దతుదారుల్లో అసంతృప్తి
సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప కుటుంబంలో ‘పేరవై’ చిచ్చు రగిలింది. ఇందులో నుంచి తాను తప్పకుంటున్నట్టు దీప భర్త మాధవన్ ప్రకటించడం చర్చకు దారి తీసింది. ఈ పరిణామాలు మద్దతుదారుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. దివంగత సీఎం జయలలిత రాజకీయ వారసురాల్ని తానేనని ఆమె మేనకోడలు దీప ప్రకటించడం అన్నాడీఎంకేలోని ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ పెద్ద సంఖ్యలో హర్షం వ్యక్తం చేశాయి. దీప ఇంటి ముందు పెద్ద ఎత్తున వాలడంతో ఇక, రాజకీయ పయనానికి జయలలిత మేనకోడలు శ్రీకారం చుట్టారు. ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై పేరుతో ముందుకు సాగేందుకు నిర్ణయించారు.
అయితే, ఆమెకు రాజకీయ అనుభవం తక్కువే. సరిగ్గా సలహాలు ఇచ్చే వారు తక్కువేనని చెప్పవచ్చు. ఈ రెండు వెరసి దీప పేరవైలో సమస్యల సృష్టికి కారణం అయ్యాయన్న ప్రచారం సాగుతోంది. ఆ పేరవైకు నిర్వాహకుల ఎంపిక మొదటి నుంచి వివాదానికి దారి తీసూ్తవస్తోంది. వారికి వ్యతిరేకంగా అసంతృప్తి రగులుతున్న సమయంలో ఇన్ చార్‌జల నియామక ప్రకటన దీపను ఇరకాటంలో పడేసినట్టుం ది. అసలు ఆ జాబితాను ఆమె అధికారికంగా ప్రకటించినట్టు సమాచారం. మీడియాల్లో ఆ జాబితా హల్‌చల్ సృష్టించడంతో ఇక, ఆ పేరవైలో మరింతగా చిచ్చు రగిలింది. ఆ జాబితాకు వ్యతిరేకంగా అనేక చోట్ల నిరసనలు బయలు దేరాయి. ఈ సమయంలో దీప కుటుంబంలోనూ ఆ పేరవై చిచ్చు రగల్చడం చర్చకు దారి తీసింది.
తప్పుకున్న మాధవన్ : జయలలిత మరణం తదుపరి తెరమీదకు వచ్చిన దీపకు వెన్నంటి ఆమె భర్త మాధవన్ ఉంటూ వస్తున్నారు. దీప ఎక్కడికి వెళ్లినా, ఆయన అనుసరిస్తున్నారు. రాజకీయ అరంగేట్రం, పేరవై ఏర్పాటు ప్రకటన వరకు తోడునీడగా మాధవన్ ఉన్నారు. అయితే, ఆ పేరవై నిర్వాహకుల ఎంపిక, ఇన్ చార్జ్ ల జాబితా దీప కుటుంబంలోని చిచ్చు రగిల్చినట్టుంది. ఈ విషయాల్లో తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేని మాధవన్, ఆ పేరవై నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం చర్చకు దారి తీశాయి.
మూడు నెలలుగా దీప వెన్నంటి ఉన్న ఆయన రెండు మూడు రోజులుగా దూరంగా ఉంటూ రావడంతో కొందరు మీడియా ప్రతినిధులు కదిలించి ఉన్నారు. తాను పేరవై వ్యవహారాల్లో ఎలాంటి జోక్యం చేసుకోదలచుకోలేని, దీప ఉన్నత స్థానంలో ఉంటే ఆనందించే మొదటి వ్యక్తి తానేనని మాధవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. తాను తప్పుకుంటున్నానని, ఆ పేరవైతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పందించడం మద్దతుదారుల్లో అసంతృప్తిని రగిల్చింది. ఇంటి వద్దకు వచ్చే మద్దతుదారులతో సంప్రదింపులు సాగించడం, సూచనలు సలహాలు ఇవ్వడంలో మాధవన్ ఇన్నాళ్లు ముందున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన తప్పుకోవడం ఆయనతో సన్నిహితంగా ఉండే మద్దతుదారులతో పాటు, దీప పేరవై మద్దతు దారుల్లో అసంతృప్తి బయలు దేరినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.