
అచ్చం జయే.. ఇప్పుడు అందరి చూపు ఆమెపైనే!
చెన్నై: మెరీనా బీచ్‌లో జయలలిత సమాధి వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన వందలాది మంది అభిమానులకు బుధవారం సాయంత్రం ఒకింత ఉద్వేగపూరితమైన అనుభవం ఎదురైంది. జయలలితకు శ్రద్ధాంజలి ఘటించేందుకు వచ్చిన ఆమె మేనకోడలు దీపను చూసి.. 'అమ్మ' అభిమానులు చూపు తిప్పుకోలేకపోయారు. దీప అచ్చం జయలలిత పోలికలతో ఉండటంతో ఆమెను చూసి కొందరు ఉద్వేగానికి లోనయ్యారు.
దీప, తన కుటుంబసభ్యులు కొందరితో కలిసి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మెరీనా బీచ్‌లోని అమ్మ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించింది. ఆమె జయలలిత స్మారక ప్రదేశంలో ప్రదక్షణ చేస్తున్నప్పుడు.. దీపను చూసేందుకు అక్కడున్న వారు పెద్ద ఎత్తున గుమిగూడారు. కొంతమంది అమ్మను చూసినట్టు భావించి భావోద్వేగానికి గురయ్యారు. కొందరు మహిళలు దీప వద్దకు వెళ్లి 'నిన్ను చూస్తే అచ్చం అమ్మను చూసినట్టే ఉంది. ఆమె పోలికలు నీ ముఖంలో కనిపిస్తున్నాయి' అని పేర్కొన్నారు.
కొద్ది క్షణాల్లోనే చాలామంది పోటెత్తారు. కొంతమంది ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. ఎటూ కదలకుండా ఆమె చుట్టూ జనాలు మూగడంతో అతికష్టం మీద భద్రతవలయంలో ఆమెను స్థానికంగా ఉన్న స్క్వేర్ పోలీసు స్టేషన్‌కు పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత పంపించారు.
జయలలిత అంత్యక్రియలను శశికళ చేయడం తనకు బాధ కలిగించిందని అంతకుముందు దీప పేర్కొన్న విషయం తెలిసిందే. ఆమె బుధవారం ‘సాక్షి’టీవీతో మాట్లాడుతూ.. తన మేనత్త జయలలిత మృతి విషయంలో అనేక ఆంతరంగిక విషయాలున్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని చెప్పారు. నిజానికి జయలలితకు నివాళులర్పించేందుకు కూడా దీపకు శశికళ వర్గీయులు సరిగ్గా అనుమతించలేదు. మెరీనా బీచ్ వద్ద జయలలిత భౌతికకాయాన్ని తరలించిన తర్వాత కేవలం ఒకసారి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించేందుకు శశికళ బంధువులు దీపను అనుమతించారు. ఆ వెంటనే వారు జయలలిత పార్థీవదేహాన్ని చుట్టుముట్టి.. అక్కడినుంచి దీపను పంపించివేశారు.
అంతకుముందు గత ఆదివారం కూడా దీప అపోలో ఆస్పత్రి వద్ద కనిపించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అత్తను చూసేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకుంది. కానీ ఆమె ప్రయత్నం సఫలం కాలేదు. గతంలో అపోలో ఆస్పత్రి వద్ద జయలలిత వారసురాలిని తానేనంటూ దీప హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. జయలలితకు స్వయానా సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మి దంపతుల కూతురు దీప. జయకుమార్ దంపతులు కొన్నాళ్లు జయలలితతో పాటు పోయెస్‌గార్డెన్‌లో ఉండేవారు. దీప ఆ ఇంట్లోనే పుట్టింది.