నిర్మాతతో విభేదాలపై జయసుధ క్లారిటీ!
సీనియర్ నటి జయసుధ ప్రస్తుతం ఆర్ నారాయణమూర్తి హీరోగా నటిస్తున్న ‘హెడ్ కానిస్టేబుల్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదలవాడ శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి కొద్దిరోజుల కిందట నిర్మాతకు, జయసుధకు మధ్య అపార్థాల వల్ల విభేదాలు వచ్చాయి. దీంతో ఒకరోజు షూటింగ్ వాయిదా పడింది.
చిత్ర వర్గాల ప్రకారం కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్ నిర్ణీత సమయంలోగా జయసుధకు దుస్తులు అందించలేకపోయింది. దీంతో ఆమె కొంతవేచి చూసి.. ఆలస్యంగా షూటింగ్‌కు వచ్చింది. విషయం తెలియని నిర్మాత ఆగ్రహానికి లోనయ్యాడు. జయసుధ వ్యక్తిగత సిబ్బందిపై కేకలు వేశాడు. నిర్మాత కోపానికి గురైన విషయం తెలియడంతో జయసుధ ఆయనకు వివరణ ఇచ్చింది. ఇందులో తన తప్పేం లేదని తెలిపింది. గత 30 ఏళ్లుగా జయసుధ తన కాస్ట్యూమ్స్ తానే డిజైన్ చేసుకుంటున్నది. ఇందుకోసం ఒకరోజు ముందుగానే దర్శకుడితో సంబంధిత సీన్‌లోవేసుకోవాల్సిన దుస్తుల కోసం ఆమె చర్చిస్తుంది.
దీనిపై జయసుధ మీడియాతో స్పందిస్తూ ‘ఇదేం పెద్ద విషయం కాదు. చిన్న అపార్థం వల్ల ఇది జరిగింది. దర్శకుడు నాకు ఫోన్ చేశాడు. ఎలాంటి జాప్యం లేకుండా డిసెంబర్ 3 నుంచి షూటింగ్ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుంది’ అని తెలిపారు. ఆర్ నారాయణమూర్తి కోసమే ఈ సినిమాను జయసుధ ఒప్పుకొన్నట్టు సన్నిహత వర్గాలు తెలిపాయి.