టీడీపీ గూటికి జేసీ బ్రదర్స్ ? | JC Diwakar Reddy Brothers to Join TDP? | Sakshi
Sakshi News home page

టీడీపీ గూటికి జేసీ బ్రదర్స్ ?

Published Tue, Oct 29 2013 3:37 AM | Last Updated on Thu, Aug 16 2018 5:07 PM

టీడీపీ గూటికి జేసీ బ్రదర్స్ ? - Sakshi

టీడీపీ గూటికి జేసీ బ్రదర్స్ ?

నవంబర్ 7 లేదా 9న ముహూర్తం  
చంద్రబాబుతో రెండున్నరేళ్ల కిందటి మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమే

 
 సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకోనున్నారా? ఇన్నాళ్లూ తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ గూటికి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి చేరనున్నారా? రెండున్నరేళ్ల క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో కుదుర్చుకున్న మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే జేసీ సోదరులు ఇప్పుడు కాంగ్రెస్‌ను వీడుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. నవంబర్ 7న గానీ, 9న గానీ టీడీపీలో చేరడానికి జేసీ సోదరులు ముహూర్తాన్ని ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 1982లో తాడిపత్రి శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన జేసీ దివాకర్‌రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. 1985 నుంచి వరుసగా ఆరుసార్లు తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గాల్లో స్థానం దక్కించుకున్నారు.
 
అయితే 2009 ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభ స్థానంతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి జేసీ ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఇదే ఆరోపణలపై 2009లో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో జేసీకి స్థానం దక్కకుండా కాంగ్రెస్ అధిష్టానం అడ్డుకుంది. జిల్లాలో ప్రత్యర్థి అయిన రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తన ఆధిపత్యం చాటుకుంటూ జేసీని ఒంటరిని చేశారు. దీంతో రఘువీరా ఆధిపత్యానికి గండికొట్టాలన్న లక్ష్యంతోనే దివాకర్‌రెడ్డి చంద్రబాబుతో చేతులు కలిపారని స్థానిక నేతలు చెబుతారు. అలా చేతులు కలిపే 2011 మార్చి 24న జరిగిన అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి తన వర్గీయులతో ఓట్లేయించి ఆయన గెలుపుతో ప్రధాన భూమిక పోషించారు. తదుపరి జరిగే ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభ సీటుతో పాటు ఆ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే రెండు శాసనసభ టికెట్లను తమకు ఇచ్చేలా జేసీ బాబుతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నట్లు అప్పట్లో ఆ పార్టీ వర్గాలే వెల్లడించాయి.
 
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన తర్వాత జేసీ దివాకర్‌రెడ్డి, చంద్రబాబుల మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ మరింత పదునెక్కింది. చంద్రబాబు వైఖరిని సమర్థిస్తూ జేసీ పలు సందర్భాల్లో బాహాటంగా మాట్లాడారు. ఇదే క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌లతో కుదిరిన ఒప్పందం మేరకే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని చంద్రబాబు చేసిన ఆరోపణలనూ జేసీ సమర్థించారు. సాధారణ ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో టీడీపీ గూటికి చేరాలన్న లక్ష్యంతోనే జేసీ సోదరులు చంద్రబాబు చేసే ఆరోపణలను సమర్థిస్తూ విమర్శలు చేస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. 2014లో తాడిపత్రి నుంచి జేసీ దివాకర్‌రెడ్డి, రాయదుర్గం నుంచి దీపక్‌రెడ్డి (ప్రభాకర్‌రెడ్డి అల్లుడు), అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి తాను టీడీపీ అభ్యర్థులుగా పోటీచేయడం ఖాయమని జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేసినట్లు ఆ కుటుంబానికి సన్నిహితంగా వ్యవహరించే వర్గాలు వెల్లడిస్తున్నాయి. దివాకర్‌రెడ్డి కానిపక్షంలో ఆయన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి తాడిపత్రి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని చెబుతున్నాయి.
 
కాంగ్రెస్‌ను వీడేందుకే ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నందునే జేసీ దివాకర్‌రెడ్డి పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి. జేసీ సోదరుడు ప్రభాకర్‌రెడ్డి టీడీపీ తరపున అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు నిర్ణయం జరిగిపోయిందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సోమవారం జేసీ ఫోన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్వనాశనమైందని ఎలా చెబుతారని బొత్స జేసీని ప్రశ్నించినట్టు సమాచారం. తన మాటలను సమర్థించుకున్న జేసీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చి కంపు కొడుతోందని వ్యాఖ్యానించారు. ఈ వివరాలను జేసీయే ఇష్టాగోష్టిలో విలేకరులకు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement