జేసీ సోదరులపై భారీ ఫ్లెక్సీలు!
కళ్యాణదుర్గం : తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి పలు అరాచకాలకు పాల్పడ్డారంటూ వెలిసిన ఫెక్సీలు కలకలం సృష్టించాయి. జేసీ ప్రభాకరెడ్డి క్రిమినల్ అంటూ గత రాత్రి కళ్యాణదుర్గంలో ఫెక్సీలు వెలిశాయి . టీడీపీ కార్యాలయంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బాధితులతో కలిసి కరపత్రాలను కూడా విడుదల చేశారు. వీటిని ప్రధాన కూడళ్లలో పంపిణీ చేశారు.
కరపత్రం, ఫ్లెక్సీలలోని సారాంశం ఇలా ఉంది. ‘‘జేసీ సోదరుల స్వగ్రామం తెలంగాణలోని గద్వాల్ పట్టణం. తాడిపత్రికి వలస వచ్చి రాజకీయ పెత్తనం చెలాయిస్తూ స్థిరపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1989లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యర్థి అభ్యర్థిగా పోటీ చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మద్దులచెరువు సూరితో చేతులు కలిపి పరిటాల రవీంద్రను హతమార్చారు. సీబీఐ విచారణలో ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరును తొలగింప చేసుకున్నారు. సూరి జైలు నుంచి విడుదలైతే తాడిపత్రిలో ఊరేగించి భారీ విందు ఇచ్చారు. పరిటాల రవీంద్ర మృతి అనంతరం పరిటాల సునీత ఎన్నికల్లో పోటీ చేస్తే తాడిపత్రి నుంచి రౌడీలను పంపి భయభ్రాంతులకు గురి చేశారు. తాడిపత్రి ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కి వారిని జేసీ సోదరుల కనుసన్నల్లో ఉంచుకున్నారు. కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. ముస్లింలపై దౌర్జన్యానికి పాల్పడుతూ మసీదును ధ్వంసం చేయించారు.
బడుగు, బలహీన వర్గాల ప్రజలంటే జేసీ సోదరులకు చాలా చులకన. జేసీ సోదరుల వద్ద బడుగు, బలహీన వర్గాల నాయకులు, కార్యకర్తలు చేతులు కట్టుకుని నిలుచుకోవడం వాస్తవం కాదా? జేసీ సోదరుల అరాచకాలను విలేకరులు పత్రికల్లో కథనాలు రాస్తే ఇక వారు బలిపశువులే. తాడిపత్రి ప్రాంతంలో ఫ్యాక్షన్‌ను పెంచి పోషిస్తున్నది జేసీ సోదరులనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పదవీ వ్యామోహం కోసం వారు ఎంతకైనా బరి తెగిస్తారు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక దొడ్డి దారిలో పదవులను సంపాదించుకునేందుకు, ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకు ముందుకొస్తున్నారు. ప్రజలారా మీరే ఆలోచించండి’’ అంటూ ఆ కరపత్రం, ఫ్లెక్సీలో పొందుపరిచారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే టీడీపీకే తీవ్ర నష్టమంటూ తెలుగు తమ్ముళ్ళు ఈ ఫెక్సీల ద్వారా చంద్రబాబుకు పరోక్షంగా హితవు పలికారు. మరి సైకిల్ ఎక్కాలనుకుంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈ ఫెక్సీలు ఏ మాత్రం ఎఫెక్ట్ చూపుతాయో మరి.