బెర్లిన్: ప్రపంచ దేశాలపై ఎప్పటికప్పుడు నిఘాపెట్టే అమెరికాపైనే ఇజ్రాయెల్ నిఘాపెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరిగిన శాంతి చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీపై ఇజ్రాయెల్ గూఢచారులు, మరో సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు నిఘాపెట్టినట్లు జర్మనీకి చెందిన వారపత్రిక దెర్ స్పీగెల్ ఆదివారం కథనాన్ని ప్రచురించింది. పశ్చిమాసియా దేశాలకు చెందిన ఉన్నతాధికారులతో కెర్రీ జరిపిన ఫోన్ సంభాషణలను ఇజ్రాయెల్ గూఢచారులు ట్యాప్ చేసినట్లు పేర్కొంది. అప్పుడు కెర్రీ ట్యాపింగ్‌కు గురయ్యే శాటిలైట్ కనెక్షన్లుగల సాధారణ ఫోన్లనే వాడినట్లు వివరించింది.
పశ్చిమాసియా దేశాలతో దౌత్య పరిష్కార చర్చల్లో ఈ నిఘా సమాచారాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం వాడుకుందని పత్రిక తెలిపింది. అప్పట్లో కెర్రీ జరిపిన ఇజ్రాయిల్ -పాలస్తీనాల శాంతి దౌత్యం ఫలించకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే జూలై 8వ తేదీన గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయిల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇప్పటివరకూ 1,650 మంది పాలస్తీనియన్లు మరణించగా, 65 మంది ఇజ్రాయిల్ వాసులు అసువులు బాసారు.