తన భర్త, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి స్వర్గీయ జస్టిస్ జే.ఎస్.వర్మకి కేంద్రం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్లు ఆయన భార్య పుష్పా వర్మ శుక్రవారం స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి శుక్రవారం పుష్ప వర్మ లేఖ రాశారు. తన భర్త వర్మ పురస్కారాలు అందుకోవాలని ఏ రోజు కోరుకోలేదన్నారు. అందుకోసం ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని ఆ లేఖలో గుర్తు చేశారు. వర్మ జీవితంలో అచరించిన ఆశయాలకు పురస్కారాలు విరుద్దమని పేర్కొన్నారు.
వర్మ భార్యగా కాకుండా ఆయన మనసెరిగిన మనిషిగా తెలుపుతున్నట్లు ఆమె ఆ లేఖలో వివరించారు. దేశ ప్రజల గుండెలలో ఆయన స్థానం ఎంత పదిలంగా ఉందో తనకు తెలుసునన్నారు. అయితే వర్మకు పద్మ పురస్కారం అందజేయనున్నట్లు ప్రభుత్వం కనీసం తమకు లేఖ ద్వారా కానీ సమాచారం ఇవ్వలేదని పుష్పరాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వర్మకు పద్మభూషణ్ పురస్కారం ఇస్తున్నట్లు మీడియా ద్వారా మాత్రమే తమ కుటుంబానికి తెలిసిందన్నారు.
అయితే జనవరి మొదట్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు జె.ఎస్.వర్మ స్వగ్రామం మధ్యప్రదేశ్లోని సంతా గ్రామాన్ని సందర్శించి, ఆయన గురించి వాకబు చేశారని ఆయన కుమార్తె సుభ్ర వర్మ వెల్లడించారు. అయిన తన తండ్రి గురించి అంతగా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించింది. అనంతరం తమ నివాసానికి వచ్చి వర్మకు పద్మ పురస్కారాన్ని ఇవ్వదలచుకున్నట్లు చెప్పారని తెలిపారు.
2012 డిసెంబర్ 16న న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ జె.ఎస్. వర్మ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం మహిళలపై లైంగిక దాడులు నిరోధించేందుకు వర్మ పలు సూచనలు చేశారు.
ఆయన సూచనలు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్భయ చట్టం రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది ఏప్రిల్ 22న తీవ్ర అనారోగ్యంతో జస్టిస్ వర్మ మరణించారు. న్యాయరంగానికి జస్టిస్ జె.ఎస్.వర్మ చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రం ఆయన మరణాంతరం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.