28 రాష్ట్రాలు.. 28 వారాలు.. 28 జాబ్స్
భువనేశ్వర్: ఇంజనీరింగ్ చదవాలి. మంచి ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాలి. జీవితంలో స్థిరపడాలి. ఉద్యోగంలో పైకి రావాలి. అభద్రతా భావం అసలే ఉండకూడదు...అలా, అలా....ఎంతోమంది విద్యార్థులు ఆలోచిస్తారు. కానీ భువనేశ్వర్‌లో బీటెక్, అహ్మదాబాద్ ఎంఐసీఏలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన జుబానాశ్వ మిశ్రా అలా అలోచించలేదు. అందుకనే దేశంలోని (తెలంగాణ మినహా) 28 రాష్ల్రాల్లో 28 వారాలపాటు 28 ఉద్యోగాలు చేశారు. ఫొటోగ్రాఫర్ ఉద్యోగంతో మొదలుపెట్టి ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్‌గా, ఓ తేయాకు తోటలో కర్షకుడిగా, తేయాకు కంపెనీలో కార్మికుడిగా, టాటు ఆర్టిస్ట్‌గా, రివర్ రాఫ్టింగ్ గైడ్‌గా,రైతు కూలీగా, పారిశుద్ధ్య కార్మికుడిగా, ఆఖరికి శ్మశానంలో కాటికాపరి సహచరుడిగా పనిచేశారు.
2013లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే అందరి విద్యార్థుల్లాగే అతను కూడా ఎలాంటి కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం చేయాలా? అని ఆలోచించారు. బోర్‌కొట్టే అలాంటి ఉద్యోగం ఎందుకనుకున్నారు. జీవితంలో సంతృప్తినిచ్చేది కొత్తగా ఏం చేయాలా? ఆలోచిస్తుండగా, కెనడాకు చెందిన సియాన్ ఐకెన్ అనే ఆయన 52 వారాల్లో 52 ఉద్యోగాలు చేశాడన్న వార్త ఓ పత్రికలో చదివారు. అంతే భారత్‌లోని 28 రాష్ట్రాల్లో (అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు)28 వారాల పాటు 28 జాబ్స్ చేయాలని సంకల్పానికి వచ్చారు. ఆ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారు. వారు ఇదేం పోయేకాలం రా! అంటూ అందరు తల్లిదండ్రుల్లాగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్క 28 వారాలు ఓపిక పట్టండి, ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిస్తానంటూ బతిమాలి, బామాలి వారిని ఒప్పించారు. మొదట ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో హర్యానాలో ఫొటోగ్రాఫర్ జాబ్ సంపాదించారు. నేరుగా అక్కడికెళ్లిపోయారు. వారం రోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో మౌంటేన్ క్లీనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్లానింగ్ లేదు. వారాంతంలో మరో రాష్ట్రానికి వెళ్లడం, అక్కడ తక్షణమే దొరికిన జాబ్‌లో చేరిపోవడం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్లే స్కూల్లో టీచర్‌గా, అసోంలో టీ ఫ్యాక్టరీలో కార్మికుడిగా, మహారాష్ర్టలో సినిమాల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా, పశ్చిమ బెంగాల్‌లో మట్టిబొమ్మలు తయారుచేసే పనివాడిగా, జమ్మూ కశ్మీర్‌లో రివర్ రాఫ్టింగ్ గైడ్‌గా, ఒడిషాలోని ఓ టీవీ చానెల్‌లో టీఆర్‌పీ విశ్లేషకుడిగా, కర్నాటకలో కన్సల్టెంట్‌గా, గోవాలో టాటూ ఆర్టిస్ట్‌గా, చెన్నై బీచ్‌లో పల్లీలు అమ్మేవాడిగా, ఉత్తరప్రదేశ్‌లో శ్మశానంలో కాటికాపరి సహాయకుడిగా ఇలా మొత్తం 28 జాబ్‌లు చేశారు మిశ్రా. రైలు, బస్సు, టాక్సీ, ఫ్లైట్, ట్రామ్, ఆటో, బైక్, రిక్షా, బోటు, బల్లకట్టు, కాలి నడకన తన ప్రయాణం సాగిందని, తాను మొత్తంగా దాదాపు 25 వేల కిలోమీటర్లు ప్రయాణించానని చెప్పారు. ఏడాదికిపైగా సాగిన తన ప్రయాణంలో ఎన్నో సమస్యలు, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు. అందువల్ల మధ్యలో రెండు వారాలపాటు తన ప్రయాణం ఆగిందని చెప్పారు. వృత్తిపరంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్లే స్కూల్లో పనిచేయడం సంతృప్తినిచ్చిందని, అయితే వివిధ రాష్ట్రాల్లో వివిధ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడం ఆనందం కలిగించిందని ఆయన చెప్పారు. తన పర్యటన అనుభవాల విశేషాలతో ఓ పుస్తకం రాస్తున్నానని, దాదాపు పూర్తికావచ్చని తెలిపారు. ఆ పుస్తకాన్ని ఓ పబ్లిషర్‌కు చూపించగా, అతను ప్రచురించడానికి తిరస్కరించారని, మరో పబ్లిషర్ కోసం ప్రస్తుతం వెతుకుతున్నానని చెప్పారు.
మీ భవిష్యత్ గురించి ఆలోచన ఏమిటని మీడియా ప్రశ్నించగా, చచ్చినా కార్పొరేట్ సంస్థల్లో పని చేయనని, ప్రస్తుత దారిలోనే కొత్త ఆలోచనలతో ముందుకు పోతానని మిశ్రా చెప్పారు. తోటి వారికిచ్చే సలహా ఏమిటని ప్రశ్నించగా, ‘జీవితంలో కలలు కనేందుకు భయపడొద్దు. ఆ కలలను సాకారం చేసుకునేందుకు ముందడుగేయండి. ఎంతో మంది అవి సాధ్యం కావంటూ నిరుత్సాహ పరుస్తారు. వారి మాటలు వినకండి. ఎల్లప్పుడూ మీ హృదయం చెప్పినట్టే ముందుకెళ్లండి. దట్సాల్’ అన్నది మిశ్రా సందేశం.