28 రాష్ట్రాలు, 28 వారాలు, 28 ఉద్యోగాలు
భువనేశ్వర్: జీతాల్లో పెరుగుదల కోసం కంపెనీలు మారడం, జీవితంలో తొందరగా పెకైదగడానికి కూడా ఆ పని చేయడం నేటి యువతరం నైజం. అయితే ఒడిశాకు చెందిన 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జుబనశ్వ మిశ్రా కాస్త డిఫరెంట్‌గా ఆలోచించాడు. 28 వారాల్లో 28 ఉద్యోగాలు మారి దేశం, ఆ మాటకొస్తే సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ద్వారా ప్రపంచం దృష్టినాకర్షించాడు. ఓస్ అదెంత అనుకుంటున్నారా.. అయితే అతని మరో ప్రత్యేకత గురించి తెలుసుకోవాల్సిందే. టీచర్, ఫొటోగ్రాఫర్, సినిమా ఎగ్జిక్యూటివ్, రివర్ రాఫ్టింగ్ గైడ్, కాటికాపరి ఇలా చేసిన ఉద్యోగం చేయకుండా, మన దేశంలోని 28 రాష్ట్రాల్లో పనిచేశాడు. ఇప్పుడు అర్థమైఉంటుంది అతనెందుకంత పాపులర్ అయ్యాడో. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్‌లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడుగా పనిచేశాడు.
20 మంది 2 ఏళ్ల పిల్లలు ఒక చిన్న గదిలో మన చుట్టూ కూర్చుని ఏడుస్తుంటే ఎలా ఉంటుందో హైదరాబాద్‌లో అనుభవమైందని, అదే తనకు కష్టమైన ఉద్యోగమని కూడా చెప్పాడు. బ్రిటన్ పత్రిక డైలీ మెయిల్‌కు మిశ్రా ఇంటర్య్వూ ఇస్తూ.. ‘‘తల్లిదండ్రులు ఒత్తిడి వల్ల పిల్లలు మెడిసిన్‌కో, ఇంజనీరింగ్‌కో పరిమితమవుతూ వాళ్లు కలల్ని చిదిమేసుకుంటున్నారు. ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేయడానికి, విద్యార్థుల కలల్ని నిజం చేసుకునే ప్రయత్నం చేయాలనే నేనీ పనిచేశాను’’ అని చెప్పాడు.తొలుత చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన మిశ్రా.. ప్రస్తుతం స్వరాష్ట్రంలో రచయితగా, ఎమోషనల్ స్పీకర్‌గా పనిచేస్తున్నాడు.